Harish Rao : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలోనే ‘టింగు టింగు’మంటూ ఫోన్లలో మోగే రైతు బంధు నిధులు, ఫిబ్రవరి వచ్చినా ఇప్పటికీ విడుదల కాకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పెట్టుబడి సాయం అందక రైతులు ప్రైవేటు వడ్డీలకు తెచ్చి సాగు చేస్తున్నారని, దాని భారం రైతులపై పడుతోందని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఎరువుల కొరత రాలేదని, కానీ నేడు ఎరువుల కోసం తెల్లవారుజామున 3 గంటలకే వచ్చి చెప్పులను లైన్లో పెట్టే ‘చీకటి రోజులు’ మళ్ళీ వచ్చాయని ఆయన విమర్శించారు.
రైతుల కంట కన్నీరు – బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఫుల్!
మెదక్ జిల్లాలోని సింగూరు మరియు గణపురం ప్రాజెక్టుల కింద సుమారు 70 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించడంపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. మరమ్మతుల పేరుతో రైతులకు సాగునీరు నిలిపివేస్తూ, బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నిరంతరాయంగా నీటి సరఫరా చేయమని ఎక్సైజ్ కార్యదర్శి ఆదేశించడం విడ్డూరమని అన్నారు. “మీకు రైతుల కంటే బీరు ఫ్యాక్టరీల యజమానుల కమిషన్లే ముఖ్యమా?” అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పంట మార్పిడి విధానాన్ని పాటించి కందులు, ఆయిల్ పామ్ వంటి పంటలు వేయాలని రైతులకు సూచిస్తూనే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ. 8,000 మద్దతు ధరను దళారులకు దక్కకుండా రైతులే వినియోగించుకోవాలని కోరారు.
Revanth
హామీలు గాల్లోనే.. పోరాటమే శరణ్యం!
గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, సిట్ నోటీసులు ఇవ్వడంపై చూపే శ్రద్ధ రైతుల సమస్యలపై చూపడం లేదని ఎద్దేవా చేశారు. వెంటనే రైతు భరోసా, బోనస్, మరియు పంట నష్ట పరిహారం చెల్లించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
