SLBC: మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలి వద్దకు చేరుకున్నారు. అయితే వారిని సొరంగంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీశ్‌రావు, ఇతర నాయకులు రోడ్డుపైనే బైఠాయించిన నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై హరీశ్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మీడియాపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు.
Read Also: New Rules From March: సామాన్యులకు బిగ్ అలర్ట్.. మార్చిలో మారనున్న రూల్స్ ఇవే!
హరీష్ రావు బృందం సందర్శనతో టన్నెల్ లో చిక్కుకుపోయిన 8మందిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందంటూ పోలీసులు వారి రాకను అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ నాయకులు మాత్రం తమను టన్నెల్ వద్ధకు అనుమతించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. టన్నెల్ వద్ద సహాయక చర్యల్లో ఫెయిల్యూర్ వంటి అంశాలు బయటికి వస్తాయనే మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై మాట్లాడుతూ.. మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగ పనులు ముందుకు కదలక పోవడానికి కారణం నీటి ఊటనే అని వెల్లడించారు. నీటి ఊటను ఎదుర్కోవడానికి మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, నీటిని బయటికి పంపించేందుకు నెలకు కోటిన్నర ఖర్చు వచ్చేదని తెలిపారు. నేను విద్యుత్ శాఖా మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్ళారా చూసానని చెప్పారు. టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పామన్నారు.