Harish Rao: కాల్పుల్లో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు

చంద్రశేఖర్ అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ పార్టీ తరఫున హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Harish Rao

Harish Rao

Harish Rao: అమెరికాలోని డల్లాస్‌లో దుండగుల కాల్పుల్లో దుర్మరణం చెందిన తెలంగాణ విద్యార్థి చంద్రశేఖర్ పోలే కుటుంబాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) పరామర్శించారు. శనివారం నాడు ఎల్‌బీనగర్‌లోని చంద్రశేఖర్ నివాసానికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి వెళ్లిన హరీశ్ రావు తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఎల్బీనగర్‌కు చెందిన దళిత విద్యార్థి అయిన చంద్రశేఖర్ పోలే బీడీఎస్ (BDS) పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని డల్లాస్ వెళ్లారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) దుండగులు జరిపిన కాల్పుల్లో అతను మరణించడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

Also Read: CM Chandrababu: ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

ఈ సందర్భంగా హరీశ్ రావు.. తల్లిదండ్రులు పడుతున్న వేదనను చూసి చలించిపోయారు. “ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది. వారి దుఃఖాన్ని మాటల్లో చెప్పలేం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ కుటుంబాన్ని ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉన్నత భవిష్యత్తు కోసం కన్న కొడుకు దూర దేశం వెళితే, ఇలా మృత్యువాత పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

పార్థీవదేహం తరలింపుపై బీఆర్‌ఎస్ డిమాండ్

చంద్రశేఖర్ అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ పార్టీ తరఫున హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ పార్థీవదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలమైన ఎల్‌బీనగర్‌కు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దౌత్య మార్గాల ద్వారా సంప్రదించి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. తమ కొడుకు మరణ వార్తను జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న చంద్రశేఖర్ తల్లిదండ్రులకు ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సాయం అందించాలని కూడా హరీశ్ రావు ఈ సందర్భంగా కోరారు.

  Last Updated: 04 Oct 2025, 03:15 PM IST