Harish Rao Visited Khairatabad Maha Ganapathi : గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతి (Khairatabad Ganesh Idol)ని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. ఇక వరుస సెలవులు రావడం తో గణనాథుడిని చూసేందుకు నగర ప్రజలే కాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అలానే ప్రముఖులు సైతం మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఇక్కడకి వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది.
దర్శన అనంతరం మీడియా తో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసే ఘనత మన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు దక్కింది. మనం ఇంట్లోనే చిన్న పూజ చేయాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడుతాం. కానీ 70 ఏండ్ల నుంచి ఇంత భారీ స్థాయిలో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారంటే ఖైరతాబాద్ గణేశ్ నిర్వాహకుల కృషి గొప్పదని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం ఉన్న సంస్కృతి మనది. మనకు ఏదైనా సమస్య వస్తే అందరం ఒక్కటై కదులుతాం.. అదే భారతీయ సంస్కృతి అని హరీశ్‌రావు తెలిపారు. ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈరోజు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అకాల వర్షాలు, వరదలు రావడంతో ప్రజలు బాధ పడుతున్నారు. ఈ విఘ్నేశ్వరుడు రాష్ట్ర ప్రజలకు విఘ్నాలు తొలగించి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాను అని పేర్కొన్నారు.
ఇక ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ (Metro Station) తో పాటు బస్సు స్టాండ్ ఇలా అంత పూర్తి రద్దీగా మారింది. ఎల్బీనగర్, మియాపూర్ మార్గంలో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆయా మార్గంలో రద్దీకి తగ్గట్లుగా మెట్రో యాజమాన్యం చర్యలు చేపట్టింది. అటు నిమజ్జనానికి రెండు రోజుల సమయం ఉన్నందున రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మెట్రో స్టేషన్ లలో టికెట్ కౌంటర్ల వద్ద, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా సూచనలు చేస్తోంది. క్యూఆర్ కోడ్ టికెట్లకు, కార్డ్ ద్వారా వెళ్లే ప్రయాణికులను వేరువేరుగా పంపిస్తోంది. స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, కార్డులో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్‌లో రీఛార్జ్ చేసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. ఈ నెల 17 గణేష్ నిమజ్జనం కావడం తో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఇందుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 17వ తేదీకి బదులుగా నవంబర్ 9(రెండో శనివారం)న పనిదినంగా ప్రభుత్వం తెలిపింది.