Site icon HashtagU Telugu

Harish Rao: రాజకీయ వైద్యంలో హరీష్.!

Harishrao review corona

Harishrao

ఈటల ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుండే ఆరోగ్యశాఖను హరీష్ కి అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కరోనా వల్లే ఈ మార్పు అప్పట్లో జరగకుండా ఆగిందని చెప్పుకోవచ్చు. చివరికి పలు అనూహ్యమైన సంఘటనల తర్వాత ఆరోగ్యశాఖను హరీష్ కు అప్పగించారు.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా హరీష్ రావు ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి ఆ శాఖలో రెగ్యులర్ గా సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుసగా ప్రభుత్వ హాస్పిటల్స్ పర్యటన కూడా చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని టిమ్స్, నిమ్స్, గాంధీ హాస్పిటల్స్ లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఆయా హాస్పిటల్స్ లో చెప్పట్టాల్సిన కార్యక్రామాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు త్వరలోనే ఉంటాయని సమాచారం.

హాస్పిటల్స్ పర్యటనలో భాగంగా అక్కడి అన్ని స్థాయిల ఉద్యోగులతో మంత్రి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలంటే కొన్ని పరికరాలు కావాలని కోరడంతో వాటికోసం నిధుల మంజూరుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక కరోనా ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో బెడ్స్ పెంచడంతో పాటు వెంటిలేటర్స్ ను తొందరలోనే అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణలో ప్రతిఒక్కరికి వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యమని దానిలో భాగంగానే హాస్పిటల్స్ కి వెళ్లి అక్కడ పరిస్థితులు తెలుసుకొని, వసతుల కల్పనకు హామీ ఇవ్వడంతో పాటు నిధుల మంజూరు కూడా చేస్తున్నారు.

ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశాఖలోని సమస్యలను ప్రభుత్వం దగ్గర ఏనాడు చర్చించలేదని, ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందిస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

హరీష్ రావు ఏ పని చేసినా, ఆ పనికి అదనపు లాభం చేకూరే విధంగా అతడి పనివిధానం ఉంటుందని రాజకీయ నాయకులతో పాటు విశ్లేషకులు అంటుంటారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖలో ప్రక్షాళన చేయడంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందడమే కాకుండా తమపార్టీపై విమర్శలు చేస్తున్న ఈ శాఖ మాజీ మంత్రి ఈటల తన శాఖలో చేయగలిగే పనులను కూడా చేయలేకపోయాడని ఈటలపై అసమర్థ ముద్ర కూడా పడే అవకాశం కూడా ఉంది. ఈ రెండు టీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశాలే.

 https://twitter.com/trsharish/status/1469544004807053317

Exit mobile version