Site icon HashtagU Telugu

Harish Rao: భర్తను తలచుకొని ఏడుస్తే.. చిల్లర రాజకీయాలా? – హరీశ్‌రావు ఫైర్

Harish Rao

Harish Rao

హైదరాబాద్, జూబ్లీహిల్స్: బీజేపీ (BJP) నుంచి భారీగా నేతలు బీఆర్‌ఎస్ (BRS) లోకి చేరిన సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ మహిళా నాయకురాలు కళావతి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలు లక్ష్మీ, మహిళా మోర్చా (Mahila Morcha) నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మి, అనురాధ, మంజుల, సత్యవతితో పాటు సుమారు 200 మంది బీఆర్‌ఎస్‌ (BRS) లో చేరారు. హరీశ్‌రావు వారిని గులాబీ కండువాలు (Pink Scarves) కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, మాగంటి గోపీనాథ్‌ను జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆశీర్వదించి ఐదేళ్లకు ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. కానీ ఆయన అకాలమరణం పాలయ్యారని, ఆ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం గోపీనాథ్‌ సతీమణి మాగంటి సునీతకు బీఆర్‌ఎస్‌ టికెట్ ఇచ్చామన్నారు. భర్తను కోల్పోయి ఇంకా రెండు నెలలూ కాలేదని, ఆమె ఇంకా తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ ఆమె కన్నీళ్లను కూడా కాంగ్రెస్‌ నేతలు రాజకీయం చేయడం దుర్మార్గమని ఆరోపించారు.

మహిళ అయిన సునీత దుఃఖాన్ని అవమానించేలా మాట్లాడటం దుర్వినియోగం అని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు విజ్ఞులని, ఎవరిని ఎంచుకోవాలో బాగా తెలుసని చెప్పారు. రాహుల్‌ గాంధీ బిహార్‌ ఎన్నికల్లో ఓట్‌ చోరీ విషయమై మాట్లాడుతున్నారని, అదే సమయంలో జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి అక్రమ ఓట్లతో ఆటలు ఆడుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. రాహుల్‌కు రేవంత్‌కు నీతులు చెప్పే నైతిక బాధ్యత లేదా అని నిలదీశారు.

20వేల దొంగ ఓట్లు తెప్పించి సునీతను ఓడించాలనే కుట్ర జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణను ఏం చేసాయో ప్రజలు ఓసారి ఆలోచించాలని సూచించారు. రెండు పార్టీలూ మాట ఒకటిగా, పని వేరుగా చేస్తున్నాయని విమర్శించారు.

మోదీ “సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్” అని, రాహుల్‌ “మొహబ్బత్ కి దుకాణ్” అని చెబుతున్నారని, కానీ హైడ్రా పేరుతో పేదల ఇళ్ళను కూల్చే కార్యక్రమం ఏమిటని ప్రశ్నించారు. ఆదివారం రాత్రి పండుగ రోజు పేదవారి ఇళ్లు కూలగొట్టిన రేవంత్‌ రెడ్డి చర్యలపై రాహుల్ గాంధీ మౌనంగా ఎందుకు ఉన్నారన్నారు.

పట్టణాల మధ్య ముఖ్యులు నివసిస్తున్న ఇళ్ళు కూల్చరాదా? అని ప్రశ్నిస్తూ.. పట్నం మహేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, గాంధీ గవర్నమెంట్‌ ల్యాండ్‌ కబ్జా పెట్టుకుని ఉన్నారని ఆరోపించారు. పేదల ఇళ్లే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు.

Exit mobile version