Harish Rao: 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వలేదు!

  • Written By:
  • Updated On - April 20, 2024 / 12:07 AM IST

Harish Rao: జహీరాబాద్‌లో ఈద్ మిలాప్ కార్యక్రమంలో జహీరాబాద్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అబద్ధాలతో పోటీ పడుతోంది. రేవంత్, భట్టి అబద్ధాల్లో పోటీ పడుతున్నారు. రేవంత్ 4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తే అసలు ఆ హామీనే ఇవ్వలేదని భట్టి నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధమాడాడు. రైతు రుణమాఫీని వంద రోజుల్లో చేస్తామని చెప్పలేదని భట్టి చెప్పారు. ఇది రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను అవమానించడమే. ఎన్నికల ప్రచారంలో బాండు పేపర్లు రాసిచ్చి ఇప్పుడు పనైపోయిందని మోసం చేశారు. బాండు పేపర్లే మీ పాలిట భస్మాసుర హస్తాలవుతాయి’’ అని హరీశ్ రావు మండిపడ్డారు.

‘‘అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణమాఫీపై అన్నాడు రేవంత్. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. మాట తప్పి, రైతులను అవమానించినందుకు సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలి. ఒక్క ఉచిత బస్సు హమీ తప్ప మొత్తం 13 హమీలూ తుస్సే.రైతులకిచ్చిన ఆరు గ్యారంటీలు మోసం. మహిళలకు, వృద్ధులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు మోసం. రాష్ట్రంలో వచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదు. రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయినా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? ప్రభుత్వ చేతిగానితనం వల్లే ప్రజలకు ఇన్ని కష్టాలు. నష్టపోయిన పంటకు ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీశ్ రావు అన్నారు

‘‘200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు. పరామర్శ లేదు. రైతులు నిలదీస్తారని భయపడుతున్నారా? కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది.బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైతే కవిత ఎందుకు అరెస్టవుతుంది? గవర్నర్ ఎందుకు మా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరిస్తారు? బీజేపీని ఎదుర్కోవాలంటే అది బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. ముస్లిం సంక్షేమం కోసం పాటుపడింది. రంజాన్ తోఫా ఇచ్చింది. మైనారిటీల బడ్జెట్ పెంచాం, పథకాలు తెచ్చాం. నాణ్యమైన విద్య, ఓవర్సేస్ స్కాలర్‌షిప్‌లు అందించాం రేవంత్ ప్రభుత్వం తోఫాను రద్దు చేసింది. షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు. రేవంత్ బీజేపీ కనుసన్నల్లో పని చేస్తున్నాడు. అతని రాజకీయ పునాదులు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నాయి’’ అని హరీశ్ రావు అన్నారు.