భారత రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు కవిత (kavitha) పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లేఖ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లేఖ నిజమైనదేనా లేక నకిలీదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించేందుకు నిరాకరించారు. “తర్వాత మాట్లాడతా” అని మాత్రమే చెప్పారు. మరోవైపు KTR కూడా ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.
ఈ లేఖ రాజకీయ ఉద్దేశాలతో సృష్టించబడిందన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. BRS నేత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. “వాస్తవంగా కవిత గారు లేఖ రాశారో లేదో ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ ఆమె రాశారని ఊహించినా, అందులో కాంగ్రెస్‌ను ప్రశంసించారా? అంతలో ఏముంది? ఇది కాంగ్రెస్ పన్నిన కుట్ర కావచ్చని అనిపిస్తోంది” అంటూ వ్యాఖ్యానించారు.
ఇక ఈ లేఖపై అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ లేఖ ప్రస్తావనతో పార్టీ మరింత దెబ్బతిన్నదనే అభిప్రాయం ప్రచారంలో ఉంది. కవిత స్వయంగా దీనిపై స్పందిస్తేనే వాస్తవం వెలుగులోకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.