Harish Rao React On Koushik Reddy House Attack : బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (Arekapudi Gandhi) తన అనుచరులతో వెళ్లి దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కౌశిక్‌రెడ్డికి గాంధీ క్షమాపణలు చెప్పాలని ..ఇదేం ప్రజాస్వామ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని .. ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరని హరీష్ రావు అన్నారు. పదుల సంఖ్యలో గాంధీ తన అనుచరులతో దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి దాడులు జరిగాయా అంటూ ప్రశ్నించారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం ఈ దాడిని ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఎటు పోతున్నదని .. ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకపోవడమేనా అని నిలదీశారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
అసలేం జరిగిందంటే..
నిన్న తెలంగాణ భవన్ లో కౌశిక్ రెడ్డి..శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (Arikepudi Gandhi ) తో పాటు పలువురు ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం గాంధీ నివాసానికి వెళ్లి ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరవేసి అక్కడి నుండి తెలంగాణ భవన్ కి వచ్చి ప్రెస్ మీట్ పెడతానని కౌశిక్ ప్రకటించాడు. దీంతో కొండాపూర్ లోని కౌశిక్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకొని పోలీసులు ఆయన్ను గృహనిర్బంధం చేసారు. అటు గాంధీ కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే నా ఇంటికి రా.. లేదంటే నేనే నీ ఇంటికి వస్తాను అంటూ సవాల్ విసిరారు. ఇలా ఇరు నేతల సవాళ్ల మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో అని ముందు జాగ్రత్తగా పోలీసులు నిర్బంధం చేసారు.
నీ ఇంటికి వచ్చా.. చూస్కుందాం రా..
గాంధీ చెప్పినట్లే కౌశిక్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున తన అనుచరులతో వెళ్ళాడు..అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి చొచ్చుకెళ్లి అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఇంటి అద్దాలను కుర్చీలతో పగులగొట్టారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే గాంధీ దాడి చేసేలా వారిని ఎగదోశారు. నీ ఇంటికి వచ్చా.. చూస్కుందాం రా.. అంటూ కౌశిక్ రెడ్డికి గాంధీ సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బయటకు రావాలంటూ అక్కడే బైఠాయించారు. కోవర్టుల మూలంగా పార్టీ నాశనం అయ్యిందని దుయ్యబట్టారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతావా అంటూ మండిపడ్డారు గాంధీ. కరీంనగర్ నుంచి నీవు బతకడానికి రాలేదా అంటూ ప్రశ్నించారాయన. క్రిమినల్ అని తెలిసి గవర్నర్ దూరంగా పెట్టింది వాస్తవం కాదా? అంటూ గాంధీ విమర్శించారు.
తెరపైకి నాన్ లోకల్ అంశం
మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అదేస్థాయిలో రెచ్చిపోయారు. తెలంగాణ పవరేంటో రేపు చూపిస్తానన్నారు. ఈ క్రమంలో నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. చివరకు పరిస్థితి గమనించిన పోలీసులు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also : Balineni : వైసీపీకి మరో బిగ్ షాక్.. బాలినేని రాజీనామా?