Site icon HashtagU Telugu

Harish Rao: రాజ్ భవన్ కు ‘రాజకీయ’ రంగు!

Rajbhavan

Rajbhavan

మహిళ అయినందుకే గవర్నర్ తమిళి సై ను బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానించలేదని బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి హరీశ్ రావు అన్నారు. గవర్నర్ తమిళి సై కు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదనే విషయమై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ పీఎం కాగానే గుజరాత్ గవర్నర్ కమల బెణి వాల్ ను డిస్మిస్ చేశారని, అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ ఇటీవలే అందరూ మాతృ మూర్తులను అవమానించారని గుర్తుచేశారు. ‘భేటీ బచావో భేటీ పడావో’ నిధుల్లో 80 శాతం మోడీ ప్రచారానికి ఖర్చు పెట్టారని పార్లమెంటు స్థాయి సంఘం చెప్పిందని, ఎవరు మహిళలను అవమానపరుస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.

రాజ్ భవన్ కు బీజేపీ వాళ్ళు ఎందుకు కాషాయ రంగు పులుముతున్నారని, గవర్నర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది బీజేపీ నేతలేనని, ఏదైనా సమస్యలుంటే శాసన సభా సచివాలయం, రాజభవన్  లు చేసుకుంటాయని అన్నారు. అవగాహన లేకనే బీజేపీ నేతలు ‘కోర్టు కు వెళతాం’ అని అంటున్నారు, శాసనసభ కు ఉన్న హక్కులు బండి సంజయ్ కు తెలియవా అని హరీశ్ రావు ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థపై కేసీఆర్ కు గౌరవం ఉందని, గతం లో గవర్నర్ నరసింహన్ ను ఇపుడు తమిళ్ సై ని గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దారి చూపే కాగడా.. బీజేపీది వెలుగు నివ్వని దీపం అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఓ సారి రాజ్యాంగాన్ని చదువుకోవాలని, బండి సంజయ్ మీద ఆ పార్టీ లోనే అసమ్మతి ఉందని అన్నారు.

రాజ్యాంగం మీద, గవర్నర్ వ్యవస్థ మీద కేసీఆర్ కు గౌరవం ఉందని, గవర్నర్ వ్యవస్థ ను అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలకు తెలుసు అని, బలం లేకున్నా అర్ధరాత్రి సీఎంలతో ప్రమాణాలు చేయించిన ఘనత కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వానిది హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలకే రాద్ధాంతం సరికాదు అని, ప్రొరోగ్ కాలేదు కనుకే గవర్నర్ ను పిలువ లేదు అని స్పష్టం చేశారు.  దేశభక్తి గురించి మాకు బీజేపీ చెప్పాల్సిన అవసరం లేదు, పీఎం మోడీ పాకిస్థాన్ కు వెళ్లి ఎవరి విందు స్వీకరించారో అందరికీ తెలుసు అని, రాజకీయ రంగు పులిమితే అది బీజేపీ కే తగులుతుంది అని పేర్కొన్నారు. మాతృమూర్తులను అవమానించిన బీజేపీ కి మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని మంత్రి హరీశ్ రావు తనదైన స్టయిల్ లో బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.