Harish Rao: రేషన్ డీలర్లకు కమీషన్లు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా ఖండించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్ డీలర్లు ఆయన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిరక్ష్య వైఖరి రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన అంశాలు
పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్న డీలర్లు కమీషన్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది దుర్మార్గమని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరు కారణంగా డీలర్లు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రూ. 5,000 గౌరవ వేతనం, కమీషన్ పెంపు హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని, ఇది ‘మాటలు తప్ప చేతలు లేని కోతల ప్రభుత్వం’ అని విమర్శించారు.
Also Read: Hanuman Idol Controversy in USA: టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై సెనేటర్ తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. 2014లో మెట్రిక్ టన్నుకు రూ. 200 ఉన్న కమీషన్‌ను రూ. 1,400కి పెంచామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడినా డీలర్ల సంక్షేమం కోసం కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా, కరోనా సమయంలో మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకాల కింద డీలర్‌షిప్ మంజూరు చేశామని, డీలర్‌షిప్ వయోపరిమితిని 40 నుంచి 50 ఏళ్లకు పెంచామని ఆయన వివరించారు.
ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కమీషన్, సెప్టెంబర్ కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు రూ. 5,000 గౌరవ వేతనం, కమీషన్ పెంపును వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరి రేషన్ డీలర్ల పండుగలను దూరం చేస్తోందని ఆయన విమర్శించారు.
