Harish Rao: తెలంగాణ సరే.. గుజరాత్ సంగతేంటి? బండిపై హరీశ్ రావు ఫైర్

తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ను మంత్రి హరీష్ రావు నిలదీసారు.

  • Written By:
  • Updated On - March 24, 2023 / 04:46 PM IST

ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. నష్టపరిహారం విషయంలో కేసీఆర్ కేంద్రంపై చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. తెలంగాణలో ప్రధాన మంత్రి ఫసల్ భీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు హరీశ్ రావు బండిపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలుచేయడం లేదో చెప్పాలని బండి సంజయ్ ను మంత్రి హరీష్ రావు నిలదీసారు. ఈ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేకపోవడం వల్లే చాలా రాష్ట్రాలు అమలుచేయడం లేదని… అందులో తెలంగాణ కూడా వుందని అన్నారు.

‘‘పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ గారు ఎకరాకు రూ. 10 వేలు సాయం చొప్పున, రూ. 228 కోట్లు ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారు. బిజెపి నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా?’’ అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.

‘‘నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు ఆదాని ఆదాయాన్ని డబుల్ చేశారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ, నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర మీది. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు, రైతు సంక్షేమం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమే’’ అని హరీశ్ రావు బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారని హరీశ్ రావు గుర్తు చేశారు.