మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

మైక్రో బ్రేవరీస్ కేటాయింపుల్లో భారీ స్కామ్ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రేవరీస్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియలో భారీ అవినీతి చోటుచేసుకుందని హరీష్ రావు ఆరోపించారు. మొత్తం 110 దరఖాస్తులు రాగా, పారదర్శకంగా డ్రా తీయకుండా కేవలం 25 మందికి మాత్రమే లైసెన్సులు ఇచ్చేలా తెర వెనుక ఒప్పందాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Harish Rao Movie Tickets

Harish Rao Movie Tickets

Micro Breweries : కాంగ్రెస్ సర్కార్ కు మాజీ మంత్రి , బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పలు స్కామ్ లకు కాంగ్రెస్ నేతలు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్న ఆయన, తాజాగా తెలంగాణలోని ఎక్సైజ్‌ శాఖలో మరో భారీ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మైక్రో బ్రేవరీస్ (Micro Breweries) కేటాయింపుల వ్యవహారం పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

మైక్రో బ్రేవరీస్ కేటాయింపుల్లో భారీ స్కామ్ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రేవరీస్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియలో భారీ అవినీతి చోటుచేసుకుందని హరీష్ రావు ఆరోపించారు. మొత్తం 110 దరఖాస్తులు రాగా, పారదర్శకంగా డ్రా తీయకుండా కేవలం 25 మందికి మాత్రమే లైసెన్సులు ఇచ్చేలా తెర వెనుక ఒప్పందాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో మంత్రి కోటా, ఒక ముఖ్య నేత కోటా అంటూ విభజించి, ఒక్కో బ్రేవరీకి రూ. 1.80 కోట్ల ధర నిర్ణయించారని ఆరోపించారు. ఒక ముఖ్య నేతకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఈ వసూళ్ల పర్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఒకటిన్నర కోటి ముఖ్య నేతకు, 30 లక్షలు ఆ ‘నీడ’ లాంటి వ్యక్తికి అందుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

నీళ్ల మళ్లింపు – రైతులపై వివక్ష :

ఈ ప్రభుత్వానికి రైతుల కంటే బీరు కంపెనీలే ముఖ్యమని హరీష్ రావు విమర్శించారు. మెదక్ జిల్లాలో సాగునీరు అందక 45 వేల ఎకరాలకు రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే, సంగారెడ్డిలోని సింగూరు నీళ్లను మాత్రం అక్రమంగా బీరు కంపెనీలకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి స్వయంగా జిల్లాకు వెళ్లి రైతులకు నీళ్లు ఆపి, కంపెనీలకు ఇవ్వాలని ఆదేశించడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో బ్రీజర్స్ కొరత ఉన్నా, బ్రేవరీ కంపెనీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 6500 కోట్ల బకాయిలు చెల్లించకపోవడానికి కారణం వాటాల పంపకాల్లో తలెత్తిన వివాదాలేనని ఆయన స్పష్టం చేశారు.

గౌడన్నల పట్ల నిర్లక్ష్యం – తాగుబోతుల తెలంగాణ :

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమాదాలకు గురైన గౌడన్నలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. గీత కార్మికులపై వందల సంఖ్యలో కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని విమర్శించారు. హలోగ్రామ్ టెండర్ల కోసం అధికార పార్టీ నేతల మధ్యే గొడవలు జరుగుతున్నాయని, రాష్ట్రాన్ని ‘తాగుబోతుల తెలంగాణ’గా మారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమాన్ని విస్మరించి మద్యం సిండికేట్ల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదని ఆయన హెచ్చరించారు.

  Last Updated: 29 Jan 2026, 09:46 AM IST