Site icon HashtagU Telugu

Harish Rao: ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే భయమెందుకు రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించిందని, దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు గురుకుల విద్యార్థులను దొంగచాటుగా, బందోబస్తు మధ్య తరలించడంపై హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి సర్కారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు.

నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి భోజనం తిన్న తర్వాత సుమారు 64 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడిన విద్యార్థినులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం నాటికి అస్వస్థతకు గురైన విద్యార్థినుల సంఖ్య 79కి పెరిగినట్లు సమాచారం. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తోడుకోని పెరుగు తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Also Read: Ball Tampering: భార‌త్- ఇంగ్లాండ్ మ్యాచ్‌లో బాల్ టాంప‌రింగ్ క‌ల‌క‌లం.. వీడియో వైర‌ల్‌!

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు విద్యార్థులను పరామర్శించేందుకు నాగర్ కర్నూల్ బయలుదేరారు. అయితే, ఆయన రాక గురించి సమాచారం తెలియడంతో పోలీసులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రి నుంచి దొంగచాటుగా తరలించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకంత భయం రేవంత్ రెడ్డి?” అని ఆయన నిలదీశారు.

గతంలో ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల విద్యార్థిని మృతదేహాన్ని కూడా నిర్బంధాల మధ్య హైదరాబాద్ తరలించిన ఘటనను హరీశ్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను దొంగచాటుగా తరలించడం సిగ్గుచేటని విమర్శించారు. గురుకులాల్లో విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేని దిక్కుమాలిన రేవంత్ సర్కారు.. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయడం తగదని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.