Site icon HashtagU Telugu

Aadi Srinivas : విషయం తెలియకుండా విమర్శలా.. దుష్ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ హరీష్ రావు

Aadi Srinivas

Aadi Srinivas

Aadi Srinivas : బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా అబద్ధాలను ప్రచారం చేయడంలో మాజీ మంత్రి టీ. హరీష్ రావును మించినవారు లేరని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుపై జరిగిన రైతు భరోసా నిధుల చెల్లింపు వ్యవహారాన్ని అర్థం చేసుకోకుండా హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు మూడు నెలలుగా అవాస్తవ ప్రచారానికి పాల్పడుతున్నారని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గత పది సంవత్సరాలపాటు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన నేతలు, ఇప్పుడు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

“బావ, బామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరులో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు హరీష్ రావు, కేటీఆర్, కవిత కలిసి కుట్రలు పన్నుతున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో అపోహలు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. “రైతులకు మేం న్యాయం చేస్తుంటే, మీ హయాంలో రైతులను మోసం చేశారు. 40 కేజీల ధాన్య సంచికి 44 కేజీల తూకం వేసి రైతుల్ని నష్టపరిచారు. రుణమాఫీ వాయిదా వేసి వారి నమ్మకాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు రైతు భరోసా కింద అందుతున్న సహాయాన్ని చూసి అసహనం చెందుతున్నారు,” అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Minister Seethakka : కేటీఆర్‌కు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు

హరీష్ రావు రైతు భరోసా నిధులపై అసత్య ప్రచారం చేస్తున్నారని, అసలు విషయాలు తెలుసుకోకుండా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. “నామాపూర్ గ్రామానికి చెందిన నకీర్తి కనకవ్వకు 31 గుంటల భూమి ఉంటే 1650 రూపాయలు మాత్రమే అందాయని హరీష్ రావు అసత్య ఆరోపణ చేశారు. కానీ, వాస్తవంగా కనకవ్వకు 580/బి లో 4 గుంటలు, 943/10 లో 7 గుంటలు, మొత్తం 11 గుంటల భూమి మాత్రమే ఉంది. అందుకే 1650 రూపాయల రైతు భరోసా వచ్చింది. ఆయన నిజాలను తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు,” అని వివరించారు.

హరీష్ రావు అసలు నిజాలు తెలుసుకోకుండా ప్రభుత్వం మీద అర్థంలేని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. “హరీష్ రావు ముందుగా కంటి ఆపరేషన్ చేయించుకోవాలి. వాస్తవాలు చూడగలిగే స్థితిలోకి రావాలి,” అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై కూడా హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆది శ్రీనివాస్ విమర్శించారు. “61 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పి, చివరకు 51 శాతమే ఇచ్చారని బయటపడింది. గత ప్రభుత్వం కుల గణనపై చేసిన సర్వే వివరాలు బయట పెట్టకుండా దాచిపెట్టారు,” అని ఆయన ఆరోపించారు.

బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ అభివృద్ధిని చూసి అసహనానికి గురవుతున్నారని, అందుకే అవాస్తవ ఆరోపణలు చేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. “ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు,” అని ఆయన అన్నారు.

 Delhi CM Race: ఢిల్లీ సీఎంగా యోగి లాంటి లీడర్.. ఎందుకు ?