Harish Rao: ఆరు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు!

  • Written By:
  • Updated On - May 24, 2024 / 08:59 PM IST

Harish Rao: గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లిలో నిర్వహించిన సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. హామీలను అమలు చేయకుండా మొద్దనిద్రపోతున్న కాంగ్రెస్‌ను తట్టి లేపాలంటే ఆ పార్టీని ఓడగొట్టాలి. అధికారంలోకి వచ్చి ఆరు నెలలై ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు. జాబ్ కాలెండర్ లేదు. 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేసేది ఇలాగేనా? నిరుద్యోగులకు 4 వేల భృతి, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, అమ్మాయిలకు ఉచిత స్కూటీ.. ఒక్క హామీ అమలు కాలేదు’’ అంటూ మండిపడ్డారు.

‘‘ఉద్యోగులకు 4 డీఏలు పెండింగులో ఉన్నాయి. డీఏపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటమీద నిలబడలేదు. ఉపాధాయ్యులపై లాఠీ చార్జీ చేశారు. ఇంతకన్నా అమానుషం ఉంటుందా? నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ప్రియాంకా స్వయంగా చెప్పారు. కానీ అలాంటి హామీనే ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడుతున్నారు. మహిళలకు 2500, వడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు 15 వేలు, రైతుభరోసపా 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు, పింఛన్ 4వేలు, రైతులకు 2 లక్షణ రుణమాఫీ.. వీటిలో ఒక్క హామీ కూడా అమలు కాలేదు’’ అని హరీశ్ రావు గుర్తు చేశారు.

‘‘వడ్లకు 500 బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు సన్నవడ్లకే అని సిగ్గులేకుండా రైతులను మోసం చేశారు. విద్యావంతుడైన రాకేశ్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పాలి. హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేసేందు బీజేపీ కుట్ర చేస్తోంది. మన హైదరాబాద్ మనకే దక్కాలంటే అందరూ బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలి. తెలంగాణ హక్కుల కోసం పోరాడే ఏకైన పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్రోహం వల్లే ఏడు మండలాలు ఏపీకి వెళ్లాయి’’ అని అన్నారు.