Harish Rao: తెలంగాణాలో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార పక్షం, విపక్షం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అవతరించిన తర్వాత తెలంగాణ సెంటుమెంట్ కనుమరుగైంది. దీంతో రాష్ట్ర సాధనలో పోరాడిన ఎంతోమంది కెసిఆర్ నాయకత్వంపై యుద్ధం ప్రకటించారు. కెసిఆర్ పాలనను ఎండగడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు జై తెలంగాణ నినాదంతో ఓట్లు అడిగిన కెసిఆర్ టీమ్ ఇప్పుడేం మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతుందని ప్రశ్నిస్తున్నారు విమర్శకులు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మంగళవారం సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి హరీష్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ అభివృద్ధిలో ముందుంది . ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలే. ఆంధ్రాలో పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ రోడ్లు, దవాఖాన పరిస్థితి ఏంటో మీకు తెలుసు. అక్కడ పరిస్థితి బాగోలేక ఎంతో మంది ఆంధ్రప్రజలు తెలంగాణకు వచ్చి స్థిరపడుతున్నారు. తెలంగాణాలో స్థిరపడ్డ ఆంధ్ర ప్రజలకు ఆంధ్రాలో ఓటు ఎందుకు. మీ ఓటును తెలంగాణకు మార్చుకోండి అంటూ కార్మికులను ఉద్దేశించి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు ( Harish Rao ).
తెలంగాణ అభివృద్ధికి చెమట చుక్క చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని తెలిపారు మంత్రి. మే డే సందర్భంగా కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం చేపట్టబోతుంది. మే డే సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాలో కార్మికుల కోసం భవనాలు కట్టించేందుకు సీఎం కెసిఆర్ నిర్ణయించారని అన్నారు హరీష్. అందులో భాగంగా ఎకరా విస్తీర్ణంలో రెండు కోట్లు కేటాయించనున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ కార్మికుల కోసం మరిన్ని పథకాలు అందుబాటులోకి రానున్నాయి. మీరంతా తెలంగాణాలో ఓటు హక్కు పొందాల్సిందిగా హరీష్ సూచించారు. దీంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికుల భవన నిర్మాణ భూమి పూజకు వచ్చి ఇవేం రాజకీయాలు హరీష్ అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Read More: Harish Rao: అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సఛ్చే దిన్: కేంద్రంపై హరీశ్ రావు పైర్!