అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఇవ్వకుండా కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు (Assembly Session) నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ బీఏసీ సమావేశం నుండి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మాట్లాడుతూ, యూరియా కొరత, వరద బీభత్సం, విష జ్వరాలు, గురుకుల విద్యార్థుల మరణాలు, రోడ్డు సౌకర్యాలు లేకపోవడం వంటి అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని తాము 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరామని తెలిపారు. కానీ ప్రభుత్వం కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు జరపాలని నిర్ణయించిందని, దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం పారిపోయే ధోరణిని అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు.
Tarun Chugh : ‘మోడరన్ జిన్నా’ మమత అంటూ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు
అసెంబ్లీలో చర్చించాల్సిన ముఖ్య సమస్యలను హరీష్ రావు వివరించారు. రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టాలపై చర్చించాలని, అలాగే యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ కోరిందన్నారు. కాంగ్రెస్, బిజెపిల మధ్య జరుగుతున్న దొంగ నాటకాల వల్లే యూరియా కొరత వచ్చిందని, దీనిపై అసెంబ్లీలో చర్చించాలని అన్నారు. దీంతో పాటు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అంటురోగాలపై చర్చించాలని కోరామని తెలిపారు. గురుకులాల్లో 100కు పైగా విద్యార్థులు మరణించడం, ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్యలపై కూడా చర్చించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఖరిని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. వరదలు, యూరియా కొరత వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, బదులుగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పేరుతో బురద రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యల కంటే ప్రభుత్వానికి వేరే ఏ ప్రాధాన్యత ఉంటుందని ఆయన ప్రశ్నించారు. రేపు అసెంబ్లీలో ఏ అంశంపై చర్చించబోతున్నారో రాత్రి 9 గంటల తర్వాత చెబుతామని ప్రభుత్వం చెప్పడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని హరీష్ రావు అన్నారు. కేవలం రాజకీయాల కోసం రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ నిర్వహించడం దుర్మార్గమని, స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన విమర్శించారు.