Site icon HashtagU Telugu

Hacker : తెలంగాణ పోలీస్ యాప్స్ హ్యాక్.. 20 ఏళ్ల విద్యార్థి దొరికిపోయాడు

Hacker 20 Years Student

Hacker 20 Years Student

Hacker : అతడి వయసు 20 ఏళ్లు.. అంత చిన్న వయసులోనే దారి తప్పాడు..  హ్యాకర్‌గా మారాడు.. ఏకంగా తెలంగాణ పోలీసుశాఖకు చెందిన ‘హ్యాక్‌ఐ’ యాప్‌,  ‘టీఎస్‌కాప్‌’ యాప్, ‘ఎస్‌ఎంఎస్‌ సర్వీసెస్‌’ యాప్‌లను హ్యాక్ చేశాడు.. ఎట్టకేలకు అతడు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) పోలీసులకు చిక్కాడు. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

అతడి పేరు జతిన్‌కుమార్‌(Hacker).. వయసు 20 ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లా వాస్తవ్యుడు. అయితే గ్రేటర్‌ నోయిడాలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈక్రమంలోనే అతడు హ్యాకింగ్ కోర్సులు చేసి.. యాప్‌లు, వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం నేర్చుకున్నాడు. తొలుత తన విద్యను ఏకంగా పోలీసు యాప్స్‌పై ప్రయోగించాడు. అలా చేయడం నేరమని తెలిసినా.. అతడు పోలీసు యాప్స్‌ను హ్యాక్ చేయడానికి వెనుకాడలేదు. తొలుత అతడు తెలంగాణ పోలీసుశాఖకు చెందిన ‘హ్యాక్‌ఐ’ యాప్‌ను హ్యాక్ చేశాడు. వెంటనే దీనికి సంబంధించిన దర్యాప్తును తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో మొదలుపెట్టింది. అయినా 20 ఏళ్ల ఆ హ్యాకర్ ఊరుకోలేదు. మళ్లీ తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగానికే సంబంధించిన ‘టీఎస్‌కాప్‌’ యాప్, ‘ఎస్‌ఎంఎస్‌ సర్వీసెస్‌’ యాప్‌ను హ్యాక్ చేశాడు.

Also Read : 274 Palestinians Killed : 274 మందిని మట్టుబెట్టి.. నలుగురిని కాపాడిన ఇజ్రాయెల్

తెలంగాణ పోలీసు యాప్‌లలోని  డేటాను ఆ హ్యాకర్ దొంగిలించి మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. ఆ విలువైన సమాచారాన్ని కేవలం రూ.13వేలకు అమ్మేస్తానంటూ ఇంటర్నెట్‌లో పోస్టులు పెట్టాడు. తెలంగాణ పోలీసు యాప్స్  డేటాను కొనదల్చిన వారు తమను సంప్రదించాలంటూ హ్యాకర్‌ రెండు టెలిగ్రామ్‌ ఐడీలను ఇంటర్నెట్‌లో  పొందుపరిచాడు. తనను పోలీసులు గుర్తుపట్టకుండా ఆ హ్యాకర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీజీసీఎస్‌బీ పోలీసులు హ్యాకర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఈ వ్యవహారంపై కేసును నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సోషల్‌ ఇంజినీరింగ్‌ విధానాన్ని వినియోగించి హ్యాకర్‌ ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. అతడి లొకేషన్‌ను ట్రాక్ చేసి తెలంగాణ పోలీసులు  అరెస్టు చేశారు. అనంతరం అతడిని అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత కోర్టు అనుమతి తీసుకొని.. ట్రాన్సిట్‌ రిమాండుపై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ 20 ఏళ్ల హ్యాకర్‌ను తెలంగాణ పోలీసులు విచారించగా.. అతడు  గతంలోనూ ఈ తరహా సైబర్‌ నేరాలకు పాల్పడ్డాడని వెల్లడైంది. ఆధార్‌తో పాటు మరికొన్ని కీలక ఏజెన్సీల డేటాను కూడా అతగాడు గతంలో ఇంటర్నెట్‌లో లీక్‌ చేశాడని విచారణలో తేలింది. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయెల్‌ పర్యవేక్షణలో చాలా తక్కువ టైంలో ఈ కేసును ఛేదించారు. పోలీసుశాఖకు చెందిన యాప్‌లు హ్యాక్‌ అయినా వినియోగదారుల సున్నిత, ఆర్థిక డేటాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version