Site icon HashtagU Telugu

BRS : బీఆర్‌ఎస్‌కు షాక్‌.. గువ్వల బాలరాజు రాజీనామా

Guvvala Balaraju, Brs

Guvvala Balaraju, Brs

BRS : బీజేపీ వైపు అడుగులు వేస్తున్న బీఆర్‌ఎస్ నేత గువ్వల బాలరాజు తన పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు అధికారిక లేఖను పంపించారు. ఈ లేఖలో తన నిర్ణయానికి సంబంధించిన కారణాలను వివరించినట్లు సమాచారం.

గువ్వల బాలరాజు ఈ నెల 9న అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగుతుందని, రాష్ట్ర బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.

ఇటీవలి కాలంలో బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు, పార్టీ భవిష్యత్ దిశ పట్ల అసంతృప్తితో ఉన్న గువ్వల బాలరాజు చివరికి పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారని వర్గాల సమాచారం. బీజేపీ లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని కొత్త దిశలో కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గువ్వల బాలరాజు బీజేపీలో చేరికతో ఆ పార్టీకి గిరిజన సమాజం నుండి మరింత బలం చేకూరుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. మరోవైపు, బీఆర్‌ఎస్‌లో ఆయన రాజీనామా కలకలం రేపింది. పార్టీ లోపల ఈ పరిణామంపై నేతల మధ్య చర్చలు మొదలయ్యాయి.

గువ్వల బాలరాజు రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, ఆయన 2009లో నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తెరాస తరపున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి మంద జగన్నాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై 11,820 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి, మళ్లీ చిక్కుడు వంశీకృష్ణపై 9,441 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2022 జనవరి 26న ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుండి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చవిచూశారు. 2014 నుండి 2023 వరకు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గువ్వల బాలరాజు, బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.

Heavy rain : హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నగరమంతా జలమయం, ట్రాఫిక్‌కు బ్రేక్