హైదరాబాద్(Hyderabad)లోని చందానగర్‌లో కాల్పుల (Gun Firing) ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులోకి చొరబడి దోపిడీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగులు జరిపిన కాల్పుల్లో షాపు డిప్యూటీ మేనేజర్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి జహీరాబాద్ వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
US Tariffs : అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం వాయిదా, భారత్‌పై మరింత సుంకాల మోత
దోపిడీకి వచ్చిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరపడమే కాకుండా, షాపులోని సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేసేందుకు వాటిపై కూడా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు సైబరాబాద్ సీపీ ప్రత్యేకంగా 10 బృందాలను ఏర్పాటు చేశారు. సరిహద్దు జిల్లాలలో హై అలెర్ట్ ప్రకటించి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దోపిడీ, కాల్పుల ఘటన చందానగర్‌లో సంచలనం సృష్టించింది. నగరంలో పెరుగుతున్న నేరాల పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితులను ఎంత త్వరగా పట్టుకుంటే అంత త్వరగా ప్రజలకు భద్రతపై నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.