తెలంగాణ‌కు గులాబ్ గుబులు.. వాయుగుండ ప్ర‌భావంతో నేడూ అల‌ర్ట్

ఆకాశం చిల్లులు ప‌డిందా అన్న‌ట్టు.. వ‌రుణుడు విరుచుకుప‌డ్డాడు. ఎడ‌తెరిపి లేకుండా భారీవ‌ర్షాలు కుర‌వ‌డంతో తెలంగాణలోని ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు వ‌ణికిపోయాయి.

  • Written By:
  • Publish Date - September 28, 2021 / 12:38 PM IST

ఆకాశం చిల్లులు ప‌డిందా అన్న‌ట్టు.. వ‌రుణుడు విరుచుకుప‌డ్డాడు. ఎడ‌తెరిపి లేకుండా భారీవ‌ర్షాలు కుర‌వ‌డంతో తెలంగాణలోని ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు వ‌ణికిపోయాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ లో తోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగి ప్ర‌జ‌లు ఇబ్బందుల పాల‌య్యారు. నిన్న తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌విల‌యం చిక్కుకోగా, మరోవైపు, నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర తెలంగాణతోపాటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. నేడు కొన్ని ప్రాంతాల్లోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. వాయుగుండం ప్ర‌భావం కార‌ణంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ (మంగళవారం) సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఓ ప్రకటన చేసింది. భారీ వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌ధాన ర‌హ‌దారులన్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. దీంతో చాలా చోట్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

 

నేడూ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌టంలో ప్ర‌భుత్వ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మ‌రోవైపు విద్యుత్ శాఖాధికారులు సైతం అల‌ర్ట్ అయ్యారు. ప‌లుచోట్ల విద్యుత్ స్తంభాలను, లైన్ల‌ను స‌రిచేస్తున్నారు. వ‌ర్షాల కార‌ణంగా విద్యుత్ స్తంబాల‌ను తాక‌కూడ‌ద‌ని, బోర్లు, మోటార్లు ఆన్ చేసే స‌మ‌యంలో ప‌లు జాగ్ర‌త్తుల పాటించాల‌ని ప‌లు సూచ‌న‌లు చేసింది. గత రాత్రి కురిసిన వర్షానికి సిరిసిల్ల కలెక్టరేట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కలెక్టర్ అనురాగ్ జయంతి కలెక్టరేట్‌లోనే చిక్కుకుపోయారు. రాత్రి కలెక్టరేట్‌లోనే అనురాగ్ జయంతి బస చేశారు. కాగా ఉదయం మరింత వరద నీరు వచ్చి చేరడంతో చివరకు ట్రాక్టర్ సహాయంతో కలెక్టర్‌ను అధికారులు బయటకు తీసుకువచ్చారు.