Gujarat Result : గుజ‌రాత్ ఫ‌లితాలు ఎఫెక్ట్! టీఆర్ఎస్, టీ కాంగ్రెస్ ల‌కు కౌంట్ డౌన్!!

గుజరాత్  ఫ‌లితాలు బీజేపీకి ఇచ్చిన‌ విజ‌యం తెలుగు రాష్ట్ర‌ల్లోని రాజ‌కీయాల‌ను మలుపు తిప్పినుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న లీడ‌ర్ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది.

  • Written By:
  • Updated On - December 8, 2022 / 05:39 PM IST

గుజరాత్  ఫ‌లితాలు (Gujarat Results) బీజేపీకి ఇచ్చిన‌ అపూర్వ‌ విజ‌యం తెలుగు రాష్ట్ర‌ల్లోని రాజ‌కీయాల‌ను మలుపు తిప్పినుంది. ఇప్ప‌టి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న లీడ‌ర్ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. రాబోవు రోజుల్లో బీజేపీ విజ‌యం (bjp victory) కేంద్రంలోనూ కొన‌సాగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో బీజేపీ వైపు భారీగా ఇత‌ర పార్టీ నుంచి భారీగా ఉంటాయ‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కింగ్, ఏపీలో కింగ్ మేక‌ర్ కావాల‌ని బీజేపీ వేస్తోన్న ఎత్తుగ‌డ‌ల‌కు మ‌రింత ప‌దును పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

క‌నీసం 40 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ చాలా కాలంగా చెబుతున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు, హుజూరాబాద్‌, దుబ్బాక‌, మునుగోడు ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా అదే ప్ర‌చారం చేశారు. కేసీఆర్ సర్కార్ కూలిపోతుంద‌ని ఢిల్లీ అగ్ర నేత‌ల నుంచి గ‌ల్లీ బీజేపీ లీడ‌ర్ల వ‌ర‌కు బ‌లంగా చెప్పారు. అదే దిశ‌గా బీజేపీ అడుగులు వేస్తోందని గ్ర‌హించిన గులాబీ బాస్ వ్యూహాత్మ‌కంగా `ఫామ్ హౌస్ పైల్స్` ఆప‌రేష‌న్ ను ముగించారు. బీజేపీ అగ్ర‌నేత‌ల‌ను సైతం తెలంగాణ సిట్ ముందు దోషిలుగా నిల‌ప‌డానికి కేసీఆర్ ప్లాన్ చేశారు. ప్ర‌తిగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను బీజేపీ దూకుడుగా తీసుకొచ్చింది. ఆ రెండు పార్టీల మ‌ధ్య వైరం పెరిగింది. ఇదే స‌మ‌యంలో వెలువ‌డిన గుజరాత్ ఫ‌లితాలు టీఆర్ఎస్ పార్టీకి అంత‌ర్గ‌తంగా ద‌డ ప‌ట్టిస్తున్నాయి.

ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీలోకి ట‌చ్ లో ఉన్నారు. ఆ విష‌యాన్ని క‌మ‌ల‌నాథులు చెబుతున్నారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాత ఆచితూచి అడుగు వేస్తూ తాత్కాలికంగా అసంతృప్తి వాదులు టీఆర్ఎస్ లోనే కొన‌సాగుతున్నారు. ఇప్పుడు గుజ‌రాత్ ఫ‌లితాల‌ను చూసిన త‌రువాత గులాబీ పార్టీ ఖాళీ అవుతుంద‌ని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. ఇప్ప‌టికే చేరిక‌ల క‌మిటీని ఏర్పాటు చేసిన బీజేపీ అధిష్టానం వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి రోడ్ మ్యాప్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఫ‌లితాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఆశించిన మేర‌కు లేవు. ఇప్పుడు గుజరాత్ ఫ‌లితాలు అనూహ్యంగా బీజేపీకి అనుకూలం ఉండ‌డంతో గులాబీ పార్టీలోని అసంతృప్తి వాదులు ట‌చ్ లోకి వెళుతున్నారు. దీంతో రాబోవు రోజుల్లో కారు పార్టీ ఖాళీ కానుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ కానుంద‌ని బీజేపీ భావిస్తోంది. ఇప్ప‌టికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద అసంతృప్తిగా ఉన్న సీనియ‌ర్లు కొంద‌రు బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్నారు. ఇటీవ‌ల మ‌ర్రి శ‌శిథ‌ర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. ఆయ‌న త‌ర‌హాలో ప్ర‌తి జిల్లా నుంచి ఒక‌రు బీజేపీలో చేర‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. కానీ, బీజేపీ మాత్రం సీనియ‌ర్ల కంటే ద్వితీయ‌శ్రేణి చేరిక‌ల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. ఎలాంటి ష‌ర‌తులు, క‌మిట్ మెంట్ లు లేకుండా పార్టీ చేర‌డానికి వచ్చే వాళ్ల‌ను బీజేపీ ఆహ్వానిస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో ఉండే లీడ‌ర్ల‌కు మాత్రం కొన్ని ఆఫ‌ర్ల‌ను ఇస్తోంది. గుజ‌రాత్ ఫ‌లితాలు తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి ద‌డ పుట్టిస్తున్నాయి.

ఇక ఏపీ బీజేపీ కూడా ఇత‌ర పార్టీల‌ నుంచి వ‌చ్చే లీడర్ల‌కు ఆహ్వానం పలుకుతోంది. క‌నీసం 70 మంది వైసీపీ నుంచి బీజేపీ బాట ప‌డ‌తార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల వెలువ‌డిన ఫామ్ హౌస్ ఫైల్స్ కేసు సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ను ప‌డ‌గొట్టాలని బీజేపీ ప్ర‌య‌త్నం చేసింద‌ని కేసీఆర్ చెప్పే మాట‌. దాని ప్ర‌కారం బీజేపీ ఎప్ప‌టి నుంచో వైసీపీని ఖాళీ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోందని అర్థం అవుతోంది. అయితే, 151 మంది ఎమ్మెల్యేల‌తో స్ట్రాంగ్ గా వైసీపీని దెబ్బ‌తీయ‌డానికి అనువైన ప‌రిస్థితులు బీజేపీకా ఏపీలో రాలేదు. ఫ్యాన్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న వాళ్ల‌కు బీజేపీ ట‌చ్ లోకి వెళ్లారు. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప్ర‌త‌మై ఇప్ప‌టికే సంస్థాగ‌తంగా కొన్ని మార్పుల‌ను చేశారు. అయిన‌ప్ప‌టికీ గుజ‌రాత్ ఫ‌లితాల త‌రువాత క‌మ‌లం కండువా క‌ప్పుకోవ‌డానికి వైసీపీ లీడ‌ర్ల సై అంటున్నార‌ని తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ లీడ‌ర్లు, ఏపీలో వైసీపీ నేత‌లు కొంద‌రు బీజేపీలోకి వెళ్ల‌బోతున్నారు. ఫ‌లితంగా వైసీపీ,టీఆర్ఎస్, కాంగ్రెస్ ల‌పై తీవ్ర ప్ర‌భావం గుజ‌రాత్ ఫ‌లితాలా రూపంలో ప‌డ‌నుండ‌గా, టీడీపీ తో ఇత‌ర పార్టీలపై స్వ‌ల్పంగా ఉండ‌బోతుంద‌ని అంచ‌నా.