Site icon HashtagU Telugu

Gudem Mahipal Reddy : ‘హస్తం వద్దు..కారే ముద్దు’ అని డిసైడ్ అయ్యాడా..?

MLA Gudem Mahipal Reddy

MLA Gudem Mahipal Reddy

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy), కాంగ్రెస్ పార్టీ(Congress )లో చేరిన దాదాపు పది నెలలకే మళ్లీ తన సొంత గూటికే చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. గతంలో మూడు సార్లు బీఆర్ఎస్ (BRS)తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి.. 2024లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కేసుల భయంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆయనకు అంతగా స్వాగతం దక్కలేదని, పటాన్‌చెరులో పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల

కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి గూడెం మహిపాల్ రెడ్డికి అనేక అవమానాలు ఎదురయ్యాయని, ముఖ్యంగా పటాన్‌చెరులో అధికార కార్యక్రమాలకు ఆయనకు సమాచారం లేకుండా మంత్రులు హాజరవుతున్నారని అంటున్నారు. అంతేకాదు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన, ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమానికి కూడా ఆయనను పిలవకపోవడం గూడెం వర్గాన్ని తీవ్రంగా నిరాశకు గురి చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలతో ఆయనకున్న విభేదాలు కూడా మరింత లోతుగా మారాయని, ముఖ్యంగా కాటా శ్రీనివాస్ వర్గంతో ఆయనకు పెరిగిన దూరం, గూడెం మళ్లీ యూ-టర్న్ తీసుకునేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sandeep Reddy Vanga : నాకు రణబీర్‌పై అసూయ లేదు.. కానీ

ఈ పరిణామాల నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమయ్యారని, ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులతో సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 2న గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని ఆయన అనుచరులు అంటున్నారు. మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లో చేరితే పటాన్‌చెరు రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావడం ఖాయం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.