Group 2 Student Pravallika Incident : ఆ యువతి మరణం అందరికీ ఒక గుణపాఠం కావాలి

సాటి యువతీ యువకుల హృదయాల్లో కన్నీటి సాగరాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాన్ని ముడిపెట్టి కాలక్షం చేసే పాలకుల మెదళ్ళలో భూకంపం పుట్టింది

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 09:50 PM IST

డా. ప్రసాదమూర్తి

గ్రూప్ 2 (Group 2 ) పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో, ఆ పరీక్షలకు తయారవుతున్న ప్రవళిక (Group 2 Student Pravallika) అనే అమ్మాయి ఆత్మహత్య (Pravallika Suicide) ఉదంతం అందరికీ ఎంతో ఆవేదన కలిగించింది. బిడ్డలున్న తల్లిదండ్రుల గుండెల్లో ఏవేవో భయాందోళనల అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. సాటి యువతీ యువకుల హృదయాల్లో కన్నీటి సాగరాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. విద్యార్థుల (Students) భవిష్యత్తుతో రాజకీయాన్ని ముడిపెట్టి కాలక్షం చేసే పాలకుల మెదళ్ళలో భూకంపం పుట్టింది. రాజకీయ పార్టీల చదరంగం ఆటకు ఒక కొత్త పావు దొరికింది. ఏది ఏమైతేనేం భవిష్యత్తు కోసం బంగారు కలలు కంటున్న ఒక యువతి బతుకు మొగ్గలోనే చితికిపోయింది.

తెలంగాణలో గత కొన్నాళ్లుగా గ్రూప్ 2 పరీక్షలు (Group 2 Exams Postponed), డీఎస్సీ పరీక్షలు వాయిదాలు (DSC exam postponed) పడుతున్నాయి. జరుగుతున్న పరీక్షల్లో అవకతవకలు బయటపడుతున్నాయి. పేపర్ లీకేజీ నిర్వహణలో లోపాలు, ఆ కారణంగా అనివార్యంగా పరీక్షలు వాయిదా.. ఇలా చైన్ రియాక్షన్ లో యువత భవితవ్యంతో ఏలిన వారు ఆటలాడుకుంటున్నారు. ఎవరు కారణాలు ఏం చెప్పినా అసలే ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నచోట, ఏటేటా నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో పెరిగిపోతున్నచోట, పోగుపడుతున్న ఆశలే తప్ప నెరవేరుతున్న కోర్కెలు లేని ఎడారి నిస్పృహల నిరాశల చీకట్లు పేరుకుంటున్న చోట, ఒక అమాయక ప్రాణం గాల్లో కలిసిపోతే.. అది అందరికీ కన్నీటి కలవరమే మిగుల్చుతుంది. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం కనుచూపుమేరలో తాను కన్న కలలు సాకారం అయ్యే అవకాశం కనిపించకపోవడమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈమె ఆత్మహత్యను మసి పూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఈ ఆత్మహత్యకు కారణం ఉద్యోగం కాదు.. చదువు కాదు.. పరీక్ష కాదు.. మరొకటి అని చెప్పడానికి పోలీసులు, ప్రభుత్వం వారు అనేక తంటాలు పడుతున్నారు. కారణం ఏదైనా టిఎస్ పిఎస్సీ మరోసారి వాయిదా పడడం, దాని గురించి తన తండ్రితో ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికి ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం జరిగిన మాట వాస్తవం. దీంతో ఇప్పటికే అయోమయంలో, భయాందోళనలో, గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్న యువలోకం నిరసనకు దిగింది. ప్రభువులను చుట్టుముట్టి తమ గోడు వినిపించుకుంది. గవర్నర్ ను కలిసి వేలాది యువతీ యువకులు తమ భవిష్యత్తుకు భరోసా కావాలని విజ్ఞప్తి చేసుకున్నారు.

మరి ఈ నేపథ్యంలో ఎవరైనా ఏం ఆలోచించాలి? ప్రవళిక మరణం ఉద్యోగావకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న యువతకు ఏం చెబుతోంది? అదే బాట పట్టమనా..? పాలకులకు ఏం చెబుతోంది..? యువత భవిష్యత్తుతో రాజకీయ దొంగాట ఆడడం మానమనా? అధికారులకు ఏం చెబుతోంది..?నిర్లక్ష్యం వేడి సామర్థ్యం పెంచుకొని లక్షలాది అమాయక యువలోకం ఆశల్ని నెరవేర్చే పనుల్లో అలసత్వం చూపించవద్దనా? రాజకీయ పార్టీలకు ఏం చెబుతోంది..? రాజకీయాలు మానుకొని అందరూ కలిసి యువతీ యువకుల బంగారు భవిష్యత్తు కోసం నడుం కట్టమనా? ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో గుణపాఠాలు ప్రవళిక ఆత్మహత్య మనకు చెబుతోంది. 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం అమృత్యోత్సవాలు జరుపుకుంటున్న పెద్దలకు ప్రవళిక లాంటి అమాయక యువతీయువకుల అంతరాత్మ అగ్నిగోష వినపడదా? వేదికలెక్కి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచి, ఎన్నికల వేళ ఎన్నెన్నో పథకాలను ప్రజలకు ఆశ చూపించి, తమను మించిన వారు లేరని స్వోత్కర్షలో మునిగిపోయే నాయకులకు కనీసం కలలోనైనా ప్రవళిక లాంటి ఒక బిడ్డ కనిపిస్తుందా? కనిపిస్తే ఇకనైనా వారు తమ చుట్టూ తాము పేర్చుకున్న తప్పుల్ని బద్దలు కొట్టుకొని నిజాయితీగా నిలబడగలరా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రవళిక మరణం మన ముందు ఉంచుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రవళిక ఆత్మహత్యకు కారణం పరీక్షలా.. కాదా.. అనేది కాదు. కేవలం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అధికారులు, వారిని వెనకుండి నడుపుతున్న ప్రభుత్వాలు, ప్రవళిక లాంటి బంగారుతల్లుల భవిష్యత్తు కోసం ఎలాంటి భరోసా ఇవ్వగలవు అనేదే ఇప్పుడు ప్రశ్న. అసలే ఎన్నికల కాలం. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమని లేదు. దేశమంతా యువత భవిష్యత్తు అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. కనీసం ఒక యువతి మరణంతోనైనా దేశవ్యాప్తంగా అధికారులు, పాలకులు కళ్ళు తెరిచి, ఒళ్ళు దులుపుకొని యువత భవితవ్యం కోసం చిల్లర రాజకీయాలు మానుకొని, పెద్ద మనసు చేసుకొని నిజాయితీగా నిబద్ధతతో కూడిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఒక తెలంగాణ మాత్రమే కాదు, దేశంలో ఎక్కడా మరో ప్రవళిక ఆత్మహత్య వార్త వినిపించకూడదు. ఏది ఏమైనా మరణం పరిష్కారం కాదని, మరణంతో పోరాడి అయినా విజయం సాధించాలని, యువత సాహసంగా ముందుకు కదలాలి. వెంటాడుతున్న పేదరికం, నెరవేరని కలలు, తల్లిదండ్రుల ఆశలు ఎన్ని చుట్టుముట్టినా.. ఒక్క విజయంతో అన్నీ పటాపంచలవుతాయని, విజయం వైపు ముందుకు దూసుకుపోవడమే తమ కర్తవ్యం అని యువత దృఢ సంకల్పంతో ముందుకు కదలాలి. ప్రవళిక ఆత్మహత్య యువతకు నేర్పుతున్న పాఠం కూడా ఇదే.

Read Also : Durga Temple : ఇంద్రకీలాద్రిపై దుర్గ‌మ్మ‌ని ద‌ర్శించుకున్న శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి