అంతర్జాతీయ వాతావరణ మార్పులు, సూపర్ ఎల్-నినో తీవ్ర ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో రుతుపవనాలు ఊపందుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. గత మే నెలలో సగటున 9.26 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు, ప్రస్తుతం మరింత దిగజారి 9.47 మీటర్ల రికార్డు స్థాయికి పడిపోవడం పట్ల పర్యావరణ వేత్తలు, అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూమి పొరల్లో ఉన్న తేమ శాతం తగ్గిపోతోంది. ఇదిలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ భూగర్భజలాల క్షీణత ప్రభావం రాజధాని హైదరాబాద్ మహానగరంలో అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో గత మే నెలలో 9.93 మీటర్లుగా ఉన్న భూగర్భజల మట్టం, ప్రస్తుతానికి ఏకంగా 12.43 మీటర్లకు పడిపోయింది. దీంతో నగరంలోని మెజారిటీ ప్రాంతాల్లో బోర్లు పూర్తిగా ఎండిపోయి చుక్క నీరు కూడా రావడం లేదు. ఫలితంగా నగరవాసులు ప్రైవేట్, ప్రభుత్వ వాటర్ ట్యాంకర్లపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మొత్తం 17 జిల్లాల్లో భూగర్భజలాలు 1.6 మీటర్ల నుంచి 0.32 మీటర్ల మేర అడుగంటిపోయాయి. వ్యవసాయ రంగానికి కూడా దీని వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
