తెలంగాణ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రహదారులు కీలక భూమిక పోషిస్తాయని భావించి, కొత్త రహదారుల నిర్మాణానికి పలు ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం (Machilipatnam) (బందర్ పోర్ట్) వరకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే (Greenfield Highway) నిర్మించేందుకు సిద్ధమయ్యాయి. ఈ హైవే నిర్మాణం ద్వారా సరకు రవాణా వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి ఈ హైవే ఎంతో మద్దతుగా నిలవనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
CM Revanth : బీజేపీ ఎంపీ అరుణకు సీఎం రేవంత్ ఫోన్.. వివరాలివీ
హైవే ప్రాజెక్ట్‌కు అనుబంధంగా హైదరాబాద్ సమీపంలోని మనోహరాబాద్ వద్ద కొత్తగా డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డ్రైపోర్ట్ ట్రాన్స్‌పోర్ట్ రంగానికి ఎంతో మేలు చేస్తుందని, రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. రీజినల్ రింగు రోడ్డును (RRR) కూడా ఈ ప్రాంతంలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మల్టీమోడల్ లాజిస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీతో భేటీ అవగా, ఈ ప్రాజెక్టులకు సానుకూలత లభించినట్లు సమాచారం.
హైవే నిర్మాణం ప్రారంభమైతే, రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశముంది. ఈ రహదారి ప్రాజెక్ట్‌కు అనుమతి లభిస్తే, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.17,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం, డ్రైపోర్ట్ ప్రాజెక్టుల కారణంగా మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భూముల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ఇప్పటికే భూస్థిరాస్తి ధరలు పెరుగుతున్న ఈ ప్రాంతాల్లో, రహదారి అభివృద్ధి పనులు ప్రారంభమైన వెంటనే డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పరిశ్రమలు, వ్యాపార వృద్ధికి ఇది తోడ్పడేలా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.