Site icon HashtagU Telugu

TGreen Policy 2025 : తెలంగాణలో ‘హరిత’ వెలుగులు.. ‘టీ‌గ్రీన్ -2025’ పాలసీలో ఏముందో తెలుసా ?

Tgreen Plicy 2025 Telangana Govt

TGreen Policy 2025 :  ఎక్కడ చూసినా ‘గ్రీన్’(హరితం) అనే పదానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలోనూ ఇప్పుడు అంతటా అదే పదం ప్రతిధ్వనిస్తోంది. టీ గ్రీన్ (TGREEN) పాలసీని కాంగ్రెస్ సర్కారు రెడీ చేస్తోంది. TGREEN అంటే ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ -2025’ అని అర్థం. సౌర ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, పవన విద్యుత్, జియో థర్మల్ విద్యుత్, బయో మాస్ ఇంధనం వంటివన్నీ  పునరుత్పాదక ఇంధన వనరులు. వీటి ఉత్పత్తిని, వినియోగాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించాలని రేవంత్ సర్కారు సంకల్పించింది. తెలంగాణలో 2035 నాటికి 31,809 మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం అవసరం అవుతుందని అంచనా. అందుకే 2030కల్లా 20వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని రాష్ట్రం సంతరించుకునేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఏమేం చేయాలి ? అనే అంశాలను వివరించేదే TGREEN పాలసీ.

Also Read :IT Raids : దిల్ రాజు భార్యను బ్యాంకుకు ఎందుకు తీసుకెళ్లినట్లు..?

ప్రయారిటీ వాటికే..

TGREEN పాలసీ అమలులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ సర్కారు(TGreen Policy 2025) కలిసి పనిచేయనుంది. సీఐఐ, ఫిక్కీ, ఎన్‌టీపీసీ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోనుంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి,  నిల్వ, పంపిణీ, వినియోగంలో అవగాహన కలిగిన ప్రభుత్వరంగ, ప్రైవేటు రంగ సంస్థల నుంచి అవసరమైన సమాచారాన్ని, సాంకేతికతను సేకరించనుంది.  ఈ విభాగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కలిగిన ఇంధన కంపెనీలను సర్కారు ప్రోత్సహించనుంది. వాటికి అవసరమైన స్థలాలను, మౌలిక వసతులను సమకూర్చనుంది. ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ ప్రాజెక్టులు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు చేపట్టే కంపెనీలకు పెద్దపీట వేయనుంది. ఈ కంపెనీలన్నీ తెలంగాణలో తమ కార్యకలాపాలను మొదలుపెడితే 2030కల్లా రాష్ట్రం హరిత ఇంధనంతో వెలిగిపోనుంది. అన్ని రకాల కార్యకలాపాలను హరిత ఇంధనంతో చేసే దిశగా బాటలు పడతాయి.  ప్రత్యేక పారిశ్రామిక రంగానికి తక్కువ ధరకే హరిత ఇంధనం అందించే వెసులుబాటు కలుగుతుంది. 2030 నాటికి తెలంగాణలో అత్యధికంగా 18,874 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read :Talasani Srinivas Yadav : మేయర్‌పై అవిశ్వాసంతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించాం

డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే..

చాలామంది ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించుకుంటున్నారు. వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇంకొందరు తమకు ఉన్న సొంత స్థలాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి అయ్యే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకొందరు బ్యాటరీల ద్వారా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఈవిధమైనవన్నీ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్సెస్ (DER) పరిధిలోకి వస్తాయి. 2030 నాటికి రాష్ట్రంలో ఈ తరహాలో దాదాపు 4,330 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 2,528 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందట. దాదాపు 3,805 మెగావాట్ల హరిత ఇంధనాన్ని నిల్వ చేసే కెపాసిటీ తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని అంటున్నారు. ఆ సమయానికి వెయ్యి మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్ సైతం తెలంగాణలో ఉత్పత్తి అవుతుందట. ఇవన్నీ సాకారమైతే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం విద్యుత్‌ను కొనాల్సిన అవసరం తప్పుతుంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ సర్కారు ఏటా భారీగా ఖర్చు చేస్తోంది.