Bathukamma Celebrations In Delhi: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations In Delhi) ఘనంగా జరిగాయి.ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి గత పదేళ్ళుగా ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ప్రసంగిస్త.. “బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక. పూల రూపంలో ప్రకృతిని, స్త్రీశక్తిని ఆరాధించే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో గొప్ప స్థానముంది. అనాదిగా ప్రతి యేడు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకుంటున్నాం. ఈ తొమ్మిది రోజులపాటు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పూలవనాన్ని తలపించేలా బతుకమ్మలతో కొత్త కళను సంతరించుకుంటాయి. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి బృహదమ్మ (పార్వతి) పేరు మీదుగా బతుకమ్మ అనే పేరు వాడుకలోకి వచ్చి, అదొక ఆచారంగా స్థిరపడిందనే విషయం మనకు తెలిసిందే. బతికించే అమ్మ అనే భక్తి భావంతో ఆ జగన్మాతకు నీరాజనాలు అర్పించటమే బతుకమ్మ పండుగలో ఇమిడి వున్న అంతరార్థం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ భూమితో, ఈ జలంతో, మానవ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక సంబరంగా వేడుకలను జరుపుకోవడమే బతుకమ్మ పండుగ పరమార్థం.
Also Read: Ratan Tata: రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? విషమంగా ఉందని ప్రచారం!
దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ స్థిరపడిన తెలంగాణ బిడ్డలు బతుకమ్మ పండుగను ఇప్పటికీ మరవకుండా జరుపుకోవడం బతుకమ్మ పండుగ ప్రత్యేకతను, బతుకమ్మ పట్ల తెలంగాణ ప్రజలకున్న అభిమానాన్ని చాటుతున్నది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దేశమంతా చాటేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ యేడు తెలంగాణ భవన్ లో అట్టహాసంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నది. వీరోచిత పోరాటంతో నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛావాయువులు అందించిన కాంగ్రెస్ పార్టీ, అదే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని మహోజ్వల రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నది. బతుకమ్మ పండుగ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సేవలో పునరంకితమవుతున్నది. భావితరాలకు బతుకమ్మను అందిద్దాం. తెలంగాణ వారసత్వ సంస్కృతిని కొనసాగిద్దాం” అని ఆయన అన్నారు.
ఈ బతుకమ్మ వేడుకలకు పలువురు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్ల అధికారులు,ఇతర సిబ్బంది.. భారీగా హాజరైన బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారను.