TS MLAs Car Stickers: వీఐపీల కార్ల స్టిక్కర్లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం

ఎమ్మెల్యే స్టిక్కర్లు చాలా సందర్భాల్లో దుర్వినియోగమవుతున్నాయి. ఎమ్మెల్యే తన కారుకి స్టిక్కరు అంటించుకోవడం తప్పుకాదు.

  • Written By:
  • Updated On - July 31, 2022 / 08:29 PM IST

ఎమ్మెల్యే స్టిక్కర్లు చాలా సందర్భాల్లో దుర్వినియోగమవుతున్నాయి. ఎమ్మెల్యే తన కారుకి స్టిక్కరు అంటించుకోవడం తప్పుకాదు. ఒక్కో ఎమ్మెల్యేకి సంవత్సరానికి మూడు స్టిక్కర్లు మాత్రమే ఇస్తారు. ఒకవేళ అదనంగా కావాలంటే స్పీకర్‌ అనుమతి తప్పనిసరి.

ఐతే ఇప్పుడు తమ పలుకుబడి ఉపయోగించి కావాల్సినన్ని తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వీటిని తమ అనుచరులకు విచ్చలవిడిగా ఇస్తుండటంతో రోడ్లమీద చాలా కార్లు ఇలాంటి స్టిక్కర్లతో కనిపిస్తున్నాయి. ఐతే ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లను దుర్వినియోగం చేస్తున్నారనే కారణంతో ఇప్పుడు హోలోగ్రామ్ తో స్టిక్కర్లు ఇస్తున్నారు. ఐనా దుర్వినియోగం ఆగడం లేదు. తాజాగా జూదం వ్యవహారంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో మాధవరెడ్డి కారుకు మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్‌… ఉండడంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు మాధవరెడ్డి వాడుతున్న కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. అది మంత్రి మల్లారెడ్డికి సంబంధించినదిగా గుర్తించారు. దీంతో మాధవరెడ్డికి మంత్రి మల్లారెడ్డితో సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. మాధవ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని మల్లారెడ్డి చెప్పారు. మూడు నెలల క్రితమే దాన్ని తీసి బయటపడేశామని, దాన్ని ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధమని అన్నారు.

ఇటీవలె ఎంపీ కేసినేని స్టిక్కర్ వివాదం కూడా సంచలనం రేపింది. విజయవాడ పార్ల మెంటు సభ్యుడిగా తాను వినియోగించే వీఐపీ వాహన స్టిక్కర్ నకిలీది సృష్టించి వాడుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అలాంటి వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు. ఐతే ఈ స్టిక్కర్‌ను తన సోదరుడు కేసినేని శివనాథ్‌ భార్య కారుకి వాడినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక తెలంగాణలోనూ భోదన్‌ ఎమ్మెల్యే షకీల్‌ స్టిక్కర్‌ ఉన్న కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన కారుపై ఎమ్మెల్యే షకీల్‌ స్టిక్కర్‌ కనిపించింది. అప్పట్లో ఈ స్టిక్కర్‌ తనదేనని…కానీ ఆ కారు తనకు తెలిసిన బంధువుల వాళ్లదని చెప్పుకొచ్చారు. గతంలో నాదేండ్ర మనోహర్‌ స్పీకర్‌గా ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యే స్టిక్కర్‌ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేసింది.

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్ స్టికర్‌తో చలసాని పండు వెళ్తున్నప్పుడు దారుణ హత్య జరిగింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి స్టికర్లు లిమిట్ చేసి, హోలోగ్రామ్ విధానం తెచ్చారు. తెలంగాణలో కూడా ఇదే విధానం అమలవుతోంది. అయితే స్టిక్కర్ల ఉన్న వాహనాలతో ఎమ్మెల్యే, ఎంపీల బంధువులు, అనుచరులు రోడ్లపై యదేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో పోలీస్‌ ఉన్నాతాధికారులు దృష్టి సారించారు. స్టిక్కర్లు సంఖ్య తగ్గించడంతో పాటు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా సదరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు కుటుంబసభ్యులు వాడే నిబంధనలు మరింత కఠినం చేయాలని భావిస్తోంది.