Site icon HashtagU Telugu

Governor Tamilisai : నేడు బాస‌ర ఐఐఐటీ క్యాంప‌స్‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌.. !

Telangana Governor

Telangana Governor

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు (ఆదివారం) బాసర్ ఐఐఐటీ క్యాంపస్‌ని సంద‌ర్శించ‌నున్నారు. విద్యార్థులు, సిబ్బందితో క‌లిసి అల్పాహార విందులో ఆమె పాల్గొన‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ టూర్ నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అనంత‌రం అక్కడి నుంచి నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఆగస్టు 3న బాస‌ర ఐఐఐటీ విద్యార్థులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి తమ బాధలను వివ‌రించారు.

ఆ స‌మ‌యంలో ఆమె ఐఐఐటీ క్యాంప‌స్‌ని సంద‌ర్శిస్తాన‌ని వారికి హామీ ఇచ్చారు. మొదట ఉదయం 6 గంటలకు బాసర్‌లోని సరస్వతీ దేవిని దర్శనం చేసుకుంటారు. అనంత‌రం ఐఐఐటీ క్యాంప‌స్‌కు చేరుకుంటారు. అక్క‌డ విద్యార్థుల స‌మ‌స్య‌లు తెలుసుకుని.. ఉదయం 11 గంటలకు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు,అధ్యాపకులను కలుసుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. సీఎం కేసీఆర్, మంత్రి కె.టి.ఆర్‌లు క్యాంపస్‌కు సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని బాసర ఐఐఐటీ విద్యార్థులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

రెగ్యులర్ వైస్ ఛాన్సలర్‌ నియామకం, మూడు మెస్‌ల కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు దాదాపు 12 డిమాండ్ల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపస్‌ను సందర్శించి సమస్యల పరిష్కారానికి తక్షణ సాయంగా రూ.11 కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాతి రోజుల్లో మెస్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ​​కావడంతో 500 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.