Tamilisai and Sabitha: రండి.. చర్చించండి, సబితకు తమిళిసై అపాయింట్ మెంట్!

తెలంగాణ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు 2022పై చర్చించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Published By: HashtagU Telugu Desk
Tamilisai

Tamilisai

తెలంగాణ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు 2022పై చర్చించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. రాజ్‌భవన్ అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నవంబర్ 11న గవర్నర్ తమిళిసైని కలిసేందుకు సమయం కేటాయించారు. యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ పోస్టుల నియామకాలపై ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు సమస్యలు చర్చకు రానున్నాయి.  ఇవాళ గవర్నర్ తమిళిసై సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. తెలంగాణ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు 2022 బిల్లు ఆమోదం పొందిన తర్వాత న్యాయపరమైన సమస్యలపై ఆమె కొన్ని సందేహాలు లేవనెత్తడంతో గవర్నర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీకి లేఖ రాశారు. ఈ బిల్లు ఆమోదించడం వల్ల ఏమన్నా న్యాయపరమైన సమస్యలు వస్తాయా? అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. యూజీసీకి కూడా లేఖ రాసిన తమిళిసై.. బిల్లు అభిప్రాయాన్ని కోరారు. గత మూడేళ్లుగా ఖాళీలను భర్తీ చేయాలని పదే పదే చెబుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గత 8 ఏళ్లుగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా ఉమ్మడి నియామక బోర్డు తీసుకురావడం ద్వారా మళ్లీ న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని, నియామకాలు ఆలస్యమవుతాయని అన్నారు. అంతేగాక, విశ్వవిద్యాలయాలు దెబ్బ తింటాయని లేఖలో పేర్కొన్నారు. తమిళిసై అపాయింట్ మెంట్ ఇవ్వడంతో మంత్రి సబితా ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే!

  Last Updated: 10 Nov 2022, 03:03 PM IST