Tamilisai Vs KCR : ‘మ‌హిళాదినోత్స‌వం’లో మాట‌ల చిచ్చు

ప్ర‌తి సంద‌ర్భంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై మ‌ధ్య జ‌రుగుతోన్న ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం తాలూకూ ఆన‌వాళ్లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

  • Written By:
  • Publish Date - March 8, 2022 / 01:04 PM IST

ప్ర‌తి సంద‌ర్భంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై మ‌ధ్య జ‌రుగుతోన్న ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం తాలూకూ ఆన‌వాళ్లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా మ‌హిళాదినోత్స‌వం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. గౌరప్ర‌ద‌మైన ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్న మ‌హిళ‌ల‌కూ అగౌర‌వం త‌ప్ప‌డంలేద‌ని ఆమె చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ జ‌రిగింది. గ‌త అసెంబ్లీ స‌మావేశాలు ప్రోరోగ్ చేయ‌లేదు, కాబ‌ట్టి ఇప్పుడు జ‌రుగుతున్న స‌భ వెనుక‌టి స‌మావేశం కొన‌సాగింపంటూ సాంకేతిక అంశాన్ని కేసీఆర్ స‌ర్కార్ బ‌య‌ట‌కు తీసింది. కానీ, రాజ్ భ‌వ‌న్ మాత్రం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్రారంభించింద‌ని అభిప్రాయ‌ప‌డుతోంది.సామ్మ‌క్క‌, సార‌ల‌మ్మ ఉత్స‌వాల‌కు వెళ్ల‌డానికి హెలికాప్ట‌ర్ ను ఇవ్వ‌కుండా తెలంగాణ ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ ను అవ‌మానించింది. ముందుగా చెప్ప‌లేద‌నే సాకుతో హెలికాప్ట‌ర్ ను ఏర్పాటు చేయ‌లేదు. దీంతో రోడ్డు మార్గాన ఆమె జాత‌ర‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. గ‌ణ‌తంత్ర్య వేడుక‌లను రాజ్ భ‌వ‌న్ వ‌ర‌కు ప‌రిమితం చేయ‌డంలోనూ కేసీఆర్ స‌ర్కార్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఎప్పుడూ ప‌బ్లిక్ గార్డెన్లో చేసే ఆ వేడుక‌ల‌ను రాజ్ భ‌వ‌న్ వ‌ర‌కు పరిమితం చేయ‌డ‌మే కాకుండా సీఎం, మంత్రులు గైర్హాజ‌రు అయ్యారు. ఇలా ప‌లు మార్లు త‌మిళ సైకి తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి అవ‌మానాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఉన్న‌త ప‌దవుల్లో ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌కు అగౌర‌వం త‌ప్ప‌డంలేద‌ని ఆమె వ్యాఖ్యానించి రాజ్ భ‌వ‌న్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌హిళ‌ల‌కు ఇచ్చే ప్రాధాన్యం త‌క్కువ‌నే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ఏర్ప‌డిన తొలి మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు స్థానం లేదు. రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మంత్రివ‌ర్గంలో స్వ‌ల్పంగా మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించాడు. నామినేటెడ్ పోస్టులు, సంస్థాగ‌త ప‌ద‌వులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టిక్కెట్ల కేటాయింపు విష‌యంలోనూ మ‌హిళ‌ల‌కు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యం స్వ‌ల్పం. ఆ విష‌యంపై ప‌లుమార్లు విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. ఆయ‌న కుమార్తె క‌విత‌కు మిన‌హా మిగిలిన మ‌హిళ‌ల‌కు ప‌ద‌వులు ఇచ్చే విష‌యంలో కేసీఆర్ వెనుక‌బ‌డ్డాడు. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ చేసిన కామెంట్ తో కేసీఆర్ మ‌హిళ‌ల ప‌ట్ల చుల‌క‌న భావంతో ఉంటాడ‌నే సంకేతం వెళుతోంది.గ‌వ‌ర్న‌ర్‌, సీఎం మ‌ధ్య రెండున్న‌రేళ్లుగా నిశ్శ‌బ్ద యుద్ధం జ‌రుగుతోంది. రాజ్ భ‌వ‌న్ కేంద్రంగా ఫిర్యాదుల‌ను సేక‌రించ‌డానికి ప్ర‌త్యేక బాక్స్ ల‌ను ఏర్పాటు చేసేలా త‌మిళ సై ఆదేశించింది. ఆ బాక్స్ ల్లోని ఫిర్యాదు ఆధారంగా ప్ర‌జా ద‌ర్బార్ ను కొన్ని రోజులు నిర్వ‌హించింది. గిరిజ‌న ప్రాంతాల‌కు వెళ్లి క్షేత్ర స్థాయిలోని స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసింది. ఒక డాక్ట‌ర్ గా కోవిడ్ స‌మ‌యంలో నేరుగా ఆస్ప‌త్రుల వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టింది. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోన్న ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. పాల‌న‌లో త‌మిళ సై పాత్ర పెరుగుతూ వ‌చ్చింద‌తి. అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ మౌనంగా పాల‌న సాగిస్తూ వెళ్లారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపిక చేస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఆ మేర‌కు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న ఫైల్ ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి రాజ్ భ‌వ‌న్ కు వెళ్లింది. కానీ, ఆమోదించే విషయంలోనూ గవర్నర్ కొంత ఆలస్యం చేసింది. దీంతో గవర్నర్ కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ రెడ్డిని మండ‌లికి ఎంపిక చేయాల్సిన ప‌రిస్థితి కేసీఆర్ కు ఏర్ప‌డింది.

ఇటీవ‌ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్కు దగ్గర ధ‌ర్నా చేసిన కేసీఆర్ రాజ్ భ‌వ‌న్ కు వెళ్లి విన‌తి ప‌త్రం ఇవ్వాల‌ని తొలుత భావించార‌ట‌. ఐతే చివ‌రి నిమిషంలో రాజ్ భ‌వ‌న్ కు వెళ్ల‌కుండా మంత్రులు, కొంద‌రు నేత‌ల‌తో మోమొరాండాన్ని పంపించారు. ఇక‌ బల్దియా ఎన్నికల తర్వాత బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ మేర‌కు అధికారుల‌కు రాజ్ భ‌వ‌న్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఇలా ప్రభుత్వ విషయాల్లో గవర్నర్ నేరుగా జోక్యం చేసుకోవడం కేసీఆర్ కు ఏ మాత్రం న‌చ్చ‌లేద‌ట‌. దీంతో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌, రాజ్ భ‌వ‌న్ మ‌ధ్య ఎడం పెరిగింది.ఇదంతా చూస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో ప‌శ్చిమ బెంగాల్ త‌ర‌హా రాజ్యాంగ యుద్ధం జ‌రుగుతోంద‌ని అర్థం అవుతోంది. టీఆర్ఎస్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నింద‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేశాడు. దానిపై రాజ్యాంగ బద్ధంగా ఏమి చేయాలో..ఆ విధంగా త‌మిళ సై చేస్తున్నారు. ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ అరెస్ట్ వ్య‌వహారంపై కూడా నివేదిక‌ను కేంద్రానికి అంద‌చేసిన‌ట్టు వినికిడి. ఇలా రాష్ట్రంలో జ‌రుగుతోన్న బీజేపీ, టీఆర్ఎస్ రాజ‌కీయ యుద్ధంలో రాజ్ భ‌వ‌న్ బీజేపీ వైపు ఉంద‌ని టీఆర్ఎస్ అనుమానం. అంతేకాదు, మొద‌టి నుంచి కేసీఆర్ పాల‌న‌పై ఏదో ఒక ర‌కంగా జోక్యం, ఇప్పుడు రాజ‌కీయంగా బీజేపీపై జ‌రుగుతోన్న పోరాటంలోనూ త‌మిళ సై ప్ర‌మేయం ఉంద‌ని ఆ పార్టీ ప‌క్షాన నిలుస్తున్నార‌ని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.
స‌హ‌జంగా త‌మిళ సై బీజేపీ నాయ‌కులు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. గ‌వ‌ర్న‌ర్ గా ఎంపిక అయిన‌ప్ప‌టికీ బీజేపీ భావ‌జాలం ఉంటుంద‌నేది కాద‌న‌లేని స‌త్యం. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న‌ప్ప‌టికీ రాజకీయ నేప‌థ్యం ఉన్న కార‌ణంగా ఆ కోణం నుంచి టీఆర్ఎస్ చూస్తోంది. అందుకే, ప్ర‌గ‌తిభ‌వ‌న్‌, రాజ్ భ‌వ‌న్ కు మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్‌, సీఎం మ‌ధ్య మాటల యుద్ధానికి తెర‌లేచింది. ఈ ప‌రిణామం ఎంత వ‌ర‌కు వెళుతుందో..చూడాలి.