తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ …మహిళల సమస్యలను తెలుసుకునేందుకు ఈనెల 10న రాజ్ భవన్ లో మహిళా దర్భార్ నిర్వహించనున్నారు. ఈ దర్భార్ లో పాల్గొనే మహిళలు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.
ఈనెల 10..శుక్రవారం…మధ్యాహ్నం 12 గంటల నుంచి 1గంటలవరకు మహిళా దర్బార్ ను నిర్వహించాలని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో గత నెలలో వరుస అత్యాచారాలు చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. హైదరాబాద్ అమ్నేషియా పబ్ తోపాటు మరికొన్నిఘటనలతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాలు సర్కార్ పై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా దర్భార్ ఏర్పాటు చేయాలని గవర్నర్ నిర్ణయించారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు మహిళాదర్బార్ ను ఏర్పాటుచేసినట్లుగా చెబుతున్నారు. మహిళా దర్బార్ లో పాల్గొనే వారు ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్ మెంట్ కోసం 040- 23310521 నెంబర్ కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలని వెల్లడించారు.కాగా జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై గవర్నర్ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన సంగతి తెలిసిందే.
గత కొన్నాళ్లుగా గవర్నర్ కు , తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు. ప్రభుత్వం తనను అవమానపరుస్తుందని గవర్నర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ఇబ్బందులు పడుతూనే రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నానంటూ గవర్నర్ ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లోనూ ఇవే వ్యాఖ్యలు చేశారు.