TS : ‘ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే.. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది’ – గవర్నర్ తమిళసై

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 01:21 PM IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు. ఈ సందర్బంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్.

అలాగే తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు గవర్నర్. యువకుల బలిదానాలతో తెలంగాణ ఏర్పాటైందని గవర్నర్ తమిళిసై గుర్తుచేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడిన ఆమె.. ‘తెలంగాణ ఏర్పాటులో కలిసివచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు చెబుతోంది. ప్రత్యేక రాష్ట్రం
ఇచ్చిన అప్పటి మన్మోహన్ సర్కారుకు రాష్ట్రం కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రత్యేకించి రాష్ట్ర ఏర్పాటులో
సోనియాగాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం సర్మించుకుంటోంది’ అని వెల్లడించారు.

‘తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రజాపాలన మొదలైంది. ప్రజాభవన్ చుట్టూ కంచె తొలగింది. ప్రజల ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్నారు. ఇప్పటికే 1.8 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ప్రజలపై భారం పడకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతాం’ అని గవర్నర్ పేర్కొన్నారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. ‘ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే.. బిఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. గత సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేశాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం మొదలుపెట్టాం. దశాబ్దంగా నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం. TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛ కల్పిస్తాం’ అని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణకు కొత్తగా రూ.40వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఇటీవల దావోస్ పర్యటనలో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రూపాయి తెలంగాణ సంక్షేమం, ప్రజల పురోగతికి దోహదపడేలా బడ్జెట్ ఉంటుందని హామీ ఇచ్చారు. వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో 2 ఇప్పటికే అమలు చేశామని.. త్వరలోనే మరో 2 అమలు చేస్తామని గవర్నర్ తమిళిసై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించారు. ‘అర్హులకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ వీలైనంత త్వరగా అమలు చేస్తాం. సకాలంలో 6 గ్యారంటీలను అమలు చేస్తాం. 2 లక్షల ఉద్యోగాల భర్తీపైన కూడా తమ ప్రభుత్వం దృష్టి పెట్టింది’ అని ఆమె ప్రకటించారు.

Read Also : Book Fair: ఈ నెల 9 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్