President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో గవర్నర్, సీఎంతో పాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నారు. రాష్ట్రపతి హకీంపేట నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రపతి రేపు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు.
ఈరోజు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మొత్తం 49 మంది MBBS విద్యార్థులు, 04 మంది పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు.
ఇకపోతే.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్న భవనాన్ని 1860లో నిజాం నవాబు నజీరుద్దౌలా నిర్మించారు. సాలర్‌జంగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బొల్లారం నిజాం ప్రభుత్వం అధీనంలోని ఒక కంటోన్మెంట్ ప్రాంతంగా ఉండి, ప్రధాన సైనికాధికారి నివాసంగా ఉండేది. 1950లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దక్షిణాదిలో రాష్ట్రపతి విడిది కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిథి గృహంగా మార్చి ఈ భవనాన్ని రాష్ట్రపతి నిలయంగా నామకరణం చేశారు. 90 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో భవనాన్ని 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో మూడు ప్రధాన విభాగాలు ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి, కుటుంబ సభ్యులు, ఏడీసీ విభాగాలుగా విభజించారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో మరో 20 గదులను నిర్మించారు.
Read Also: Congress : 19న కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్‌గాంధీ భేటీ