Site icon HashtagU Telugu

Tamilisai Meets Modi: మోడీ చేతికి ‘కేసీఆర్’ చిట్టా!

Tamilisi

Tamilisi

రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా గవర్నర్‌ను కేంద్రమంత్రి కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని పలు అంశాలపై గవర్నర్‌ చర్చించినట్లు తెలుస్తోంది. వరి కొనుగోళ్ల విషయమంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై మోడీతో భేటీ కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గిరిజనులను కలిసేందుకు అడవుల్లోకి వెళ్లి కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నందుకు ప్రధాని మోదీ తనను అభినందించారని ఆమె అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిన ప్రోటోకాల్‌ ఇష్యూ గురించి కూడా ఆమె ప్రధానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. వివిధ సందర్భాల్లో తనకు ఎదురైన అవమానాలను ప్రధాని మోదీకి వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం చేసిన అవమానాన్ని గవర్నర్ కార్యాలయానికే వదిలేస్తున్నానని తమిళిసై స్పష్టం చేశారు.

గవర్నర్లు మారవచ్చు.. కానీ గవర్నర్ కార్యాలయాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలని తమిళిసై గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగంపై ఆమె స్పందిస్తూ.. శాసనసభలో ప్రసంగించేందుకు ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధిపై నివేదిక పంపలేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ తెలిపారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, తెలంగాణ ప్రజల కోసం పని చేయడం తనకు ఎప్పుడూ ఇష్టమని గవర్నర్ చెప్పారు. వరంగల్, యాదాద్రి ఆలయ పర్యటనలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా గైర్హాజరైతే గవర్నర్ చర్యలు తీసుకోవచ్చని విషయమై కూడా  రియాక్ట్ అయ్యారు. ఇక తెలంగాణలో డ్రగ్స్‌ వ్యాప్తిపై కూడా గవర్నర్‌ నివేదిక సమర్పించనున్నారు.

రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకల రోజున కూడా ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రతినిధి ఎవరూ కార్యక్రమానికి హాజరు కాలేదని గుర్తుచేసుకోవచ్చు. గవర్నర్ తన ప్రసంగంలో హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పునరుద్ధరించిన యాదాద్రి ఆలయాన్ని సందర్శించేందుకు తమిళిసై వెళ్లగా, అక్కడ ఆలయ ఈవో కూడా లేరు. అదేవిధంగా రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరుకాలేదు. ఇవే కాకుండా.. బడ్జెట్ సమావేశాల మొదటి రోజున రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలకు గవర్నర్ చేసే సంప్రదాయ ప్రసంగాన్ని రద్దు చేయడంతో సహా ప్రోటోకాల్ సమస్య, వరి కొనుగోలుపై కేంద్ర మంత్రులు క్లారిటీ ఇచ్చినా.. టీఆర్‌ఎస్ ఎంపీలు పదే పదే వరి సమస్యను లేవనెత్తుతున్న తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళిసై మోడీతో ప్రత్యేక సమావేశం కావడం పట్ల ఆసక్తిరేపుతోంది.