పదో తరగతి పరీక్షలపై (10th Class Exams) తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులను పూర్తిగా తొలగించి, 100 మార్కులకు ఒకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే దీనిపై నిపుణులతో చర్చించిన అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు పాత విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీని ప్రకారం… పదో తరగతి పరీక్షల్లో 80 శాతం మార్కులు ఎక్స్టర్నల్ (పబ్లిక్ పరీక్ష) నుండి, మిగిలిన 20 శాతం మార్కులు ఇంటర్నల్ (అంతర్గత మూల్యాంకనం) నుండి ఉంటాయి. ఈ విధానాన్ని కొనసాగిస్తూ విద్యాశాఖ తాజాగా GO (ప్రభుత్వ ఉత్తర్వు) జారీ చేసింది. ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మునుపటి పద్ధతిని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది.
Gut Health : మీ ఒంట్లో విషవాయువులు పెరిగిపోతున్నాయా..? వన్స్ గట్ హెల్త్ చెక్ చేసుకోండి
ప్రభుత్వం తొలుత ఇంటర్నల్ మార్కులను ఎత్తివేయాలని ఎందుకు భావించిందంటే, కొంతమంది ఉపాధ్యాయులు ఇంటర్నల్ మార్కులను పారదర్శకంగా ఇవ్వడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని భావించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, నిపుణులతో చర్చించినప్పుడు, ఇంటర్నల్ మార్కులు విద్యార్థి సామర్థ్యాన్ని నిరంతరం అంచనా వేయడానికి ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ మార్పులు అమలు చేయడం వలన కలిగే సాధ్యాసాధ్యాలు, విద్యార్థులపై చూపించే ప్రభావం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఎటువంటి గందరగోళం లేకుండా పాత విధానాన్ని కొనసాగించడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.