హైదరాబాద్‌లో మరో 42 ఎకరాల భూమిని వేలం వేసేందుకు సిద్దమైన ప్రభుత్వం

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేడిక్కెనుంది. భాగ్యనగరంలోని కీలక ప్రాంతాల్లో సుమారు 42 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

Published By: HashtagU Telugu Desk

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేడిక్కెనుంది. భాగ్యనగరంలోని కీలక ప్రాంతాల్లో సుమారు 42 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేలం ద్వారా దాదాపు రూ. 5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో కోకాపేటలో ఎకరం రూ. 151 కోట్లు, రాయదుర్గంలో రికార్డు స్థాయిలో రూ. 177 కోట్లు పలికిన నేపథ్యంలో, ఇప్పుడు వేలం వేయబోయే భూములకు అంతర్జాతీయ స్థాయిలో ఏ మేరకు ధర లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కొండాపూర్, బంజారాహిల్స్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాలు ఈ జాబితాలో ఉండటంతో రియల్ ఎస్టేట్ దిగ్గజాలు ఈ వేలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Telangana Government Once A

Telangana Government Once A

ఈ వేలం ప్రక్రియలో ప్రధానంగా మూడు ప్రాంతాల్లోని భూములు ఉన్నాయి. కొండాపూర్‌లో 20 ఎకరాలు, మూసాపేటలో 14 ఎకరాలు, మరియు బంజారాహిల్స్‌లో 8.37 ఎకరాలు. వాస్తవానికి మూసాపేట భూముల విక్రయంపై గతంలో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న అధికారుల నివేదికతో ప్రభుత్వం వేలానికే మొగ్గు చూపింది. బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో కూడా కొండ ప్రాంతాలను మినహాయించి, కబ్జాలకు గురయ్యే అవకాశం ఉన్న మిగిలిన ఖాళీ స్థలాలను విక్రయించడం ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించారు. ఈ భూములను ఆన్‌లైన్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా వేలం వేయడానికి HMDA ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.

హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదగడం, మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు ఇక్కడ కార్యాలయాలు స్థాపించడానికి పోటీ పడుతున్నాయి. అయితే, నగరం నడిబొడ్డున భారీ ప్రాజెక్టుల కోసం ప్రైవేటు భూములు లభించడం కష్టంగా మారడంతో, ప్రభుత్వ వేలం భూములకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ప్రైవేటు యజమానులు భూముల విక్రయానికి ముందుకు రాకపోవడం కూడా ప్రభుత్వ భూములకు రికార్డు ధరలు పలకడానికి ప్రధాన కారణమవుతోంది. ఈ క్రమంలో త్వరలో జరగబోయే వేలం ద్వారా ప్రభుత్వం తన నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.

  Last Updated: 20 Jan 2026, 11:45 AM IST