Site icon HashtagU Telugu

Kodangal: కొడంగల్ కు మెడికల్ కాలేజీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Revanth Reddy Gives Clarity About Contesting From Kodangal

Revanth Reddy Gives Clarity About Contesting From Kodangal

కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరుకోనుంది. కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో పాటు 60 బీఎస్సీ నర్సింగ్, 50 ఫిజియోథెరపీ, 30 పారామెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థుల కోసం పూర్తిస్థాయిలో హాస్టళ్లు నిర్మించనున్నారు.

కొత్త కళాశాలల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఎంఈ, ఇతర విభాగాధిపతులను వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో కొడంగల్‌లో నాలుగు కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలతోపాటు 220 పడకల బోధనాసుపత్రి నిర్మాణం కోసం రూ.224.50 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య కళాశాల భవనాలను రూ.124.5 కోట్లతో, నర్సింగ్ కాలేజీ భవనాలను రూ.46 కోట్లతో, ఫిజియోథెరపీ కళాశాల భవనాలను రూ.27 కోట్లతో రహదారులు, భవనాల శాఖ నిర్మించనుంది. 220 పడకల ఆసుపత్రిని రూ.27 కోట్లతో రాష్ట్రవైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నిర్మిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గికి ప్రభుత్వ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ మంజూరైన సంగతి తెలిసిందే. కోస్గిలో నడుస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్‌ కాలేజీగా అప్‌గ్రేడ్‌చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇది రాష్ట్రంలోని తొలి మహిళా ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ కావడం గమనార్హం.

రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటిలో ఇప్పటికే ఒక కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీసింది. మరో 10 కాలేజీల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ 10 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలే కాగా, వీటిని ఇంజినీరింగ్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. ప్రతిపాదిత కాలేజీలన్నీ గతంలో సెకండ్‌షిఫ్ట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలే కావడం గమనార్హం. ఈ కాలేజీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పాలిటెక్నిక్‌ తరగతులు నిర్వహించేవారు. అడ్మిషన్లు కూడా వేర్వేరుగా ఉండేవి. అయితే ఈ కాలేజీల్లో రెండోషిప్ట్‌ను రద్దుచేసి, ఈ కాలేజీలను రోజంతా నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా కాలేజీల్లో ఇన్‌టెక్‌ అలాగే ఉండగా, ఫ్యాకల్టీ ఆయా కాలేజీల్లోనే పనిచేస్తున్నారు.