Site icon HashtagU Telugu

CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Government

Telangana Government

CM Revanth Reddy: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి, విస్తరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ఏ మాత్రం భంగం కలగకుండా, వారి నమ్మకాలను గౌరవిస్తూనే అభివృద్ధి పనులు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.

ఆలయాన్ని విస్తరించడం, అభివృద్ధి చేయడంపై పూజారులు, ఆదివాసీ సంఘాలు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. అయితే వారు తమ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి “ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు. పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను సందర్శిస్తున్నాను” అని తెలిపారు.

Also Read: Minister Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవతో నెరవేరిన చిన్నారి జెస్సీ కల!

తన రాజకీయ జీవితాన్ని కూడా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే మొదలుపెట్టానని, ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డమీద నుంచే తాను పాదయాత్ర మొదలుపెట్టానని సీఎం గుర్తు చేసుకున్నారు. అమ్మవార్ల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.

ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందుకే వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు స్వయంగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. “సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే మా అభిమతం. ఇది డబ్బులతో కొలిచేది కాదు.. నమ్మకంతో కొలిచేది. ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలి” అని సీఎం ఉద్ఘాటించారు.

అభివృద్ధి పనులు వంద రోజుల్లో పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాలలో రాతి కట్టడాలనే ఉపయోగించాలని సూచించారు. “ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క సారలమ్మ ఆలయం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశాం” అని ఆయన వివరించారు. ఈ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములైన వారి జన్మ ధన్యమవుతుందని, ఇది తమకు దక్కిన వరం లాంటిదని పేర్కొన్నారు. ఆదాయం ఆశించి కాకుండా, భక్తితో పనిచేయాలని సూచించారు.

ఆదివాసీల పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా చెక్ డ్యామ్‌లు నిర్మించాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. రాబోయే వంద రోజులు సమ్మక్క సారలమ్మ మాలధారణ చేసినట్లుగా నిష్ఠతో పనిచేయాలని, నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పనులు పూర్తి చేయించుకునే బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.

Exit mobile version