Task Force : తెలంగాణలో ఇటీవల గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆస్పత్రుల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది.
ఇకపోతే..టాస్క్ ఫోర్స్‌లో మొత్తం 2 కమిటీలు ఉంటాయి. పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్, వార్డెన్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరు వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రతను నిర్ధారించాలి. ఈ కమిటీ రుచి చూశాకే విద్యార్థులకు ఫుడ్ వడ్డించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. మరో కమిటీకి జిల్లా స్థాయి DSWO, DTWO, DBCWO, DEO అధికారిని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, తెలంగాణలో వసతిగృహాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాశీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవు అన్నారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలి కలెక్టర్‌లను ఆదేశించారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలన్నారు. వసతి గృహాల ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం, తప్పుడు ప్రచారం చేస్తే శిక్షిస్తామని హెచ్చరించారు.