Site icon HashtagU Telugu

VRA VRO System : తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం

Hyderabad

CM Revanth

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) రెవెన్యూ శాఖ (Department of Revenue)లో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రద్దు చేసిన వీఆర్వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) వ్యవస్థ(VRA VRO System)ను పునరుద్ధరించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్వో నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 28లోగా అవసరమైన సమాచారాన్ని సేకరించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ధరణి రద్దు, భూ భారతి చట్టం అమలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ చట్టం ద్వారా భూసంబంధిత సమస్యల పరిష్కారం వేగవంతం చేయడానికి వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించారు. గతంలో ఈ వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులను ఇతర శాఖల్లోకి బదిలీ చేశారు.

వీఆర్వోలు, వీఆర్ఏల పునర్నియామకం

ప్రస్తుతం ఉన్న 10,911 రెవెన్యూ గ్రామాలకు ప్రతిదానికి ఒక వీఆర్వో ఉండేలా నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం గత వీఆర్ఏ, వీఆర్వోల వివరాలను సేకరించి అర్హత ఉన్న వారిని తిరిగి నియమించనున్నారు. అవసరమైతే కొత్త పేరుతోనైనా ఈ పోస్టులను కల్పించనున్నట్లు సమాచారం.

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు

రాష్ట్రంలో భూసంబంధిత సమస్యలు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ధరణి వల్ల భూములు కోల్పోయిన వేలాది మందికి న్యాయం చేస్తామని, భూ భారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని పునరుద్ఘాటించారు.

ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ పేరుతో కొత్తగా పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. దీంతో గ్రామస్థాయిలో భూసంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Read Also : Afghan Women Cricketers : తాలిబన్ల ఐరన్ లెగ్.. ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల దీనగాథ