Dussehra Holidays: తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులను (Dussehra Holidays) ప్రకటించింది. ఇది అంగన్‌వాడీల చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 4 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు అంగన్‌వాడీలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండుగలను జరుపుకోవడానికి వీలుగా సెలవులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ విజ్ఞప్తిని ఐఎన్‌టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బి. అన్నపూర్ణ, ఇతర ప్రతినిధులు మంత్రి సీతక్కను ప్రత్యేకంగా కలిసి సమర్పించారు.
Also Read: Asia Cup Final 2025: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో తలపడే జట్టు ఇదేనా?
మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు గ్రామ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, పిల్లల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. వారికి కూడా పండుగలు జరుపుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ నిర్ణయం అంగన్‌వాడీల ఆత్మగౌరవాన్ని పెంచుతుందని, వారి కష్టానికి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. అయితే సెలవుల సమయంలో కూడా టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు, తల్లులకు పోషకాహార లోపం లేకుండా చూడటం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆమె అన్నారు.
తమకు సెలవులు మంజూరు చేసినందుకు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం తమకు పండుగ ఉత్సాహాన్ని ఇచ్చిందని, తాము కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గుర్తింపు పొందామని వారు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ అంగన్‌వాడీలకు ఇలా సెలవులు మంజూరు చేయలేదని, ఇది తమ పట్ల ప్రభుత్వానికి ఉన్న సానుకూల దృక్పథానికి నిదర్శనమని వారు అన్నారు.