Site icon HashtagU Telugu

Google : గూగుల్ తో యువత, మహిళలు, విద్యార్థుల తలరాత మార్చే సంకల్పం!!

Google

Google

రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం , గూగుల్ తో అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీంతో గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ స్కాలర్ షిప్ లు రాష్ట్ర యువతకు అందేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణలోని మహిళా వ్యాపారవేత్తలకు డిజిటల్, బిజినెస్, ఫైనాన్షియల్ నైపుణ్యాలపై శిక్షణ అందించే విషయంలోనూ గూగుల్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయనున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు అవసరమైన డిజిటల్ బోధన, అభ్యసన ఉపకరణాలను గూగుల్ సమకూర్చనుంది. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు, వ్యవసాయ రంగంలో డిజిటల్ పరిజ్ఞానం వినియోగాన్ని పెంచేందుకు కూడా గూగుల్ తోడ్పాటును అందించనుంది. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న ప్రధాన కార్యాలయం తర్వాత గూగుల్ 3.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన రెండో అతిపెద్ద క్యాంపస్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల‌ మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ .. గూగుల్ తో తెలంగాణ సర్కారు కుదుర్చుకున్న ఎంవోయూ గురించి వెల్లడించారు. గూగుల్ 2017 నుంచే తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తోంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా పాల్గొన్నారు. కాగా, గచ్చి బౌలిలో 2019 సంవత్సరంలో గూగుల్ 7.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో 23 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తోంది. ఇందులో 3.30 మిలియన్ చదరపు అడుగుల వర్క్ స్పేస్ అందుబాటులోకి వచ్చేలా.. భవనాన్ని గూగుల్ డిజైన్ చేసింది.

Exit mobile version