TS : తెలంగాణ రైతులకు తీపికబురు…డిసెంబర్ లో రైతు బంధు: మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి..!!

  • Written By:
  • Publish Date - November 13, 2022 / 05:45 AM IST

తెలంగాణలోని రైతులకు తీపికబురు అందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి పంటకు డిసెంబర్ లోనే రైతు బంధు సాయం అందిస్తామని ప్రకటించారు. శనివారం వనపర్తిలోని నాగవరం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్ లోనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని…దీనికి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు పండించిన పంటను కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఐకేపీ, పీఎసీసీఎస్, ఏఎంసీ, మోప్మా ఆధ్వర్యంలో 225 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దళారుల మాట విని రైతులు మోసపోవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని చెప్పారు.

ఇక తెలంగాణలో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. అందులో రైతుల కోసమే ఎక్కువగా సంక్షేమ పథకాలను తీసుకువచ్చినట్లు చెప్పారు. రైతు భీమా, రైతు బంధు …రైతులను ఎంతగానే ఆకర్షించాయని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలూ కూడా ఇలాంటి సంక్షేమ పథకాలను తీసుకురాలేదన్నారు. ఈ రెండు పథకాలతోనే సీఎం కేసీఆర్ రైతులకు మరింత దగ్గరయ్యారన్నారు. వానాకాలం, యాసంగి పంటలకు ముందుగానే ఎకరానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. ఈ నగదు డైరెక్టుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుందని చెప్పారు. ఈ పథకమే టీఆర్ఎస్ ను రెండో సారి అధికారంలోకి వచ్చేలా చేసిందని స్పష్టం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి.