Ration Card E-KYC : రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల ఈ -కేవైసీ గడువు ఈనెల 31తో ముగుస్తుండగా.. దాన్ని ఫిబ్రవరి నెలఖారు వరకు పొడిగించింది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇక తెలంగాణలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ 75.76 శాతం పూర్తయింది. ఈ ప్రక్రియను ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
2014 సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా తెలంగాణలో రేషన్ కార్డుల ప్రక్షాళన జరగలేదు. మరణించినవారి పేర్లు, వివాహాలు చేసుకొని వెళ్లిపోయిన ఆడపిల్లల పేర్లు తొలగించలేదు. వాటిని తొలగించేందుకే ఇప్పుడు ఈ-కేవైసీ చేస్తున్నారు. దీనివల్ల రేషన్ సరకుల దుర్వినియోగానికి చెక్ పడుతుంది. గత సంవత్సరం సెప్టెంబరులో మొదలైన ఈ-కేవైసీ ప్రక్రియ(Ration Card E-KYC) రేషన్ షాపుల్లో ఇంకా కొనసాగుతోంది. భాగంగా లబ్ధిదారుల వివరాలతో పాటు వేలిముద్రలను సేకరిస్తున్నారు.
Also Read : Silver Broom : అయోధ్య రామమందిరానికి 1.751 కేజీల వెండితో చీపురు
రేషన్ కార్డులో పేరు ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీప రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ-పాస్’ యంత్రంలో వేలిముద్రలు వేయాలి. వేలి ముద్ర వేయగానే రేషన్‌కార్డు నంబర్‌తో పాటు కార్డు సభ్యుల ఆధార్‌కార్డు నంబర్ చూపిస్తుంది. వీటిని సరి చూసిన తరువాత ఆ మిషన్‌లో గ్రీన్ లైట్ వెలిగి సదరు సభ్యుల కేవైసీ పునరుద్ధరణ జరుగుతుంది. ఒకవేళ రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే వినియోగదారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు సరిపోలడం లేదని అర్థం. దీంతో రేషన్ కార్డ్ నుంచి ఒక యూనిట్‌ను తొలగిస్తారు. ఇక బోగస్ రేషన్ డీలర్లకు సంబంధించిన తనిఖీలు కూడా జరుగుతున్నాయని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఇద్దరిని గుర్తించినట్లు వారు వెల్లడించారు. మరోవైపు రేషన్ కేంద్రాల్లో చాలా మంది ఈ-కేవైసీ పూర్తికావడం లేదు. దీనికి రేషన్ కార్డుదారులు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడమే కారణమని డీలర్లు అంటున్నారు. దీంతో ప్రజలు ఆధార్‌లో మార్పుల కోసం ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే ఇవి కూడా తగినన్ని లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.