Site icon HashtagU Telugu

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..

Hyderabad Metro

Hyderabad Metro

దేశంలోని అత్యంత రద్దీగా ఉన్న మెట్రోల్లో హైదరాబాద్ ఒకటి. ప్రతి రోజూ సుమారు 5 లక్షలకు పైగా ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోను ఉపయోగించి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రారంభంలో మెట్రో ప్రయాణాలపై నగరవాసులలో పెద్దగా ఆసక్తి లేకపోయినా, క్రమంగా అది పెరిగి, ఇప్పుడు వారు మెట్రో సేవలను స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం, ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ అనే మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు మార్గాలలోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

నగరంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వెళ్లేందుకు మెట్రోను వాడే వారి సంఖ్య పెరిగిపోతున్నందున, ఉద్యోగులు, విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉండటంతో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ట్రైన్లలో కూర్చుని ప్రయాణాలు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కొన్ని సందర్భాలలో కాలు పెట్టుకునే స్థలం కూడా ఉండటం లేదు. ఈ పరిస్థితితో ప్రయాణికులు మెట్రో కోచ్‌ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ వేదికగా మెట్రో ప్రయాణాలపై ఒక కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కోచ్‌లను పెంచాలని, ప్రస్తుతం ఆ నిర్ణయంపై యోచన చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ట్రైన్లు 3 కోచ్‌లతో నడుస్తున్నాయి. అయితే, కోచ్‌ల సంఖ్యను ఆరుకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెట్రోని ప్రారంభంలో 3 కోచ్‌లతో నడిపించేందుకు డిజైన్ చేయబడ్డది, అయితే ఆ కోచ్‌లను 6కి పెంచే మార్పు చేయవచ్చని అన్నారు. కానీ 8 కోచ్‌లుగా మార్చడానికి ప్రస్తుత డిజైన్ అనుమతించదని పేర్కొన్నారు. త్వరలోనే 6 కోచ్‌లుగా మెట్రోని అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ మార్పుతో మెట్రోలో ప్రయాణించే రద్దీ తగ్గి, ప్రయాణికులకు కూర్చొని ప్రయాణించే అవకాశం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఇక, మెట్రో సెకండ్ ఫేజ్ పనులకి రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉందని తెలిసిందే. ఈ దశలో కొత్తగా మరో ఐదు కారిడార్లను ప్రతిపాదించారు. వాటికి సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ పథకంతో, త్వరలోనే నగరంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా మెట్రో ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది.