Housing Policy: రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ అఫర్డబుల్ హౌసింగ్ పాలసీని (Housing Policy) తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో మధ్య తరగతి ప్రజానీకం కోసం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇండ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నామని, కనీసం వంద ఎకరాలలో ఈ టౌన్ షిప్ లను నిర్మించి మధ్య తరగతి ప్రజానీకానికి అందుబాటులోకి తేవాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
శనివారం హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రి శ్రీ ఎస్ . హెచ్. రాజేష్ ధర్మాని సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న గృహనిర్మాణ పధకాల గురించి మంత్రిగారిని అడిగి తెలుసుకున్నారు. గృహనిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. హౌసింగ్ నియమ నిబంధనల మేరకు అందుబాటులో ఉన్న బోర్డు స్థలాలలో కొత్తగా గృహనిర్మాణానికి సంబంధించిన స్కీములను అమలు చేయాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
Also Read: Indian Players: ఈ ఐదుగురు టీమిండియా ఆటగాళ్లుకు షాక్ ఇచ్చిన బీసీసీఐ!
ప్రైవేట్, ప్రభుత్వరంగ భాగస్వామ్యంతో అఫర్డబుల్ గృహ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, హౌసింగ్ బోర్డుకు సంబంధించిన భూముల పరిరక్షణకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు వివిధ కోర్టులలో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ చట్టం 2014ననుసరించి ఆస్తుల, అప్పులు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పధకం ద్వారా నిరుపేదలకు శాశ్వత గృహాలు నిర్మించాలన్న సంకల్పంతో వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే మొదటి దశలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. వీలైనంత త్వరలో ఇండ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నాం. లబ్దిదారులే స్వయంగా ఇళ్లు నిర్మించుకునే సౌలభ్యం కల్పించాం. 400 చదరపు అడుగుల విస్తీర్ణం, వంటగది, టాయిలెట్ సౌకర్యం కలిగిఉంటాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమే రూ. 5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుందని వివరించారు. హైదరబాద్ నగరం వేగంగా విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుందని, హైదరబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు సిటీలు ఉండగా ఫోర్త్ సిటిగా 15 వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని మంత్రి తెలియచేసారు.