Tomato Prices : ఓ వైపు ఉల్లి ధర.. మరోవైపు టమాటా ధర మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో కేజీ ఉల్లి ధర రూ.50 దాకా పలుకుతోంది. దేశంలోని 17 రాష్ట్రాల్లో టమాటా ధరలు కేజీకి రూ.50 రేంజును దాటాయి. తొమ్మిది రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.60కిపైనే ఉంది. నాలుగు రాష్ట్రాల్లో టమాటా ధర రూ.70 కంటే ఎక్కువగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్‌లో కిలో టమాటా ధర రూ.100 దాటింది. కిలో టమాటా ధర కేరళలో రూ.82, మిజోరం, తమిళనాడు రాష్ట్రాల్లో రూ.70, తెలంగాణ, గోవా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రల్లో రూ.60 దాకా ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, సిక్కిం, ఒడిశా, దాద్రా అండ్ నగర్ హవేలీ, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రూ.50కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమాటా ధర(Tomato Prices) రూ.33గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join
నెల రోజుల్లో రూ.38 జంప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా పంట ఎక్కువగా పండుతుంది. ఆసియా ఖండంలోనే అత్యధిక టమాటాను ఉత్పత్తి చేసే మార్కెట్ గా మదనపల్లి మార్కెట్‌కు పేరు ఉంది. గత ఏడాది ఈ మార్కెట్లో టమాటా ధర రూ.200 దాటింది. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా ఈసారి చేతికొచ్చిన టమాటా పంట నీటిపాలైంది. తెల్ల పురుగు వైరస్ సోకి పంట దిగుబడి తగ్గిపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా టమాటా రైతులకు మాత్రం ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాలేదు. తక్కువ వర్షాలు కురవడం వారి అదృష్టం. పొరుగున ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ఉత్పత్తి తగ్గడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టమాటా రైతులకు మంచి టైం మొదలైంది. ఇక్కడి టమాటాకు డిమాండ్ పెరిగింది.
Also Read :Lok Sabha Session : కాసేపట్లో ఎంపీల ప్రమాణ స్వీకారాలు.. నేటి లోక్‌సభ షెడ్యూల్ ఇదే
కిలో రూ.88కి కొని ఇతర రాష్ట్రాలకు సప్లై
ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా టమాటా ధరలు హైరేంజులోనే ఉన్నాయి. ఏ గ్రేడ్ కిలో టమాటా ధర రూ.50 నుంచి రూ.70 దాకా పలుకుతోంది. ఇక బీ గ్రేడ్ కిలో టమాటా ధర రూ.70 నుంచి రూ.80 దాకా పలుకుతోంది. హైదరాబాద్‌లో కిలో టమాటా రేటు రూ.66కు చేరింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే సిటీలో టమాటా రేటు కిలోకు రూ.38 చొప్పున పెరగడం గమనార్హం. ప్రస్తుతం మదనపల్లి నుంచి 25 కేజీల టమాటా బాక్సును రూ.2200 నుంచి రూ.2500 మేర ధరకు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, బిహార్, కేరళ, మహారాష్ట్ర, పాండిచ్చేరి, బంగ్లాదేశ్, ముంబైకి సప్లై చేస్తున్నారు. అంటే సగటున రూ.88 రేటు పెట్టి మరీ మదనపల్లి నుంచి ఇతర రాష్ట్రాలకు టమాటాను సప్లై చేస్తున్నారన్న మాట. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ రేటుకు టమాటా ఇతర రాష్ట్రాలకు తరలిపోతుండటంతో.. సహజంగానే ఇక్కడ టమాటా కొరత ఏర్పడుతోంది. ఫలితంగా రేట్లు పెరుగుతున్నాయి. జూలై రెండో వారం వరకు ఇదే రేంజులో టమాటా రేట్లు కొనసాగే అవకాశం ఉంది.